* వీసీ కాలం ముగియడంతో విద్యార్థుల సంబరాలు
* రమేష్ దిష్టిబొమ్మతో నిరసన ర్యాలీ
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ పదవీ కాలం నేటితో ముగియడంతో విద్యార్థులు సంబరాలు చేసుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. నేటితో ఈ వీసీ పీడ వర్సిటీ కి వదులుతోందని విద్యార్థులు రమేష్ దిష్టిబొమ్మతో నిరసన ర్యాలీ చేపట్టారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంత కాలంగా వర్సిటీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఇష్టానుసారంగా వ్యవహరించారని విమర్శలు వ్యక్తం అయ్యాయి. విశ్వవిద్యాలయ అధ్యాపక సంఘం కూడా వీసీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టింది. వీసీ అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా మరోసారి విద్యార్థుల నిరసనలతో తాటికొండ రమేశ్ వార్తల్లోకి ఎక్కారు.
ముగిసిన వీసీల పదవీ కాలం
రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీల పదవీకాలం నేటితో ముగిసింది. కొత్త వీసీల నియామకానికి జరిగే వరకూ ఇన్చార్జి వీసీలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే యూనివర్సిటీల వీసీల ఎంపిక కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్త 1,382 దరఖాస్తులొచ్చాయి. దరఖాస్తులను పరిశీలించి, వీసీల పేర్లను సిఫారసు చేయడం కోసం సర్కారు సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రక్రియ మొదలవ్వడంతో వీసీల నియామకంలో కొంత జాప్యం జరిగింది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్నాక నాలుగు రోజుల క్రితమే సర్కారు సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. కమిటీల సమావేశాలు ఇంకా జరగలేదు. కాగా, గత మూడేళ్లుగా కొనసాగుతున్న వీసీలు తమ పదవీకాలం చివరి దశలో ఇలా పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకయతీ, ఉస్మానియా, జేఎన్టీయూ వంటి పలు యూనివర్సిటీల్లో రూ.కోట్లలో పాత బిల్లులను చెల్లించినట్టు తెలిసింది.
——————-