Gurukul Students SSC Results
* 576 మార్కులతో భరత్ టాప్.. 1
* 573 మార్కులతో కృతిక్ టాప్.. 2
* 60 మంది విద్యార్థులకు 500కు పైగా మార్కులు
* అత్యుత్తమ ఫలితాలు,100 శాతం ఉత్తీర్ణతతో ప్రభంజనం
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి విజయ డంకా మోగించారు. నేడు విడుదలైన ఫలితాల్లో పాఠశాల నుండి పరీక్షలకు హాజరైన 104 మంది విద్యార్థులూ ఉత్తీర్ణులై, 100 శాతం ఫలితాలతో మండలానికి గర్వకారణంగా నిలిచారు. మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల కంటే మిన్నగా అత్యధిక మార్కులు సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు.
విద్యార్థుల మార్కుల వివరాల్లోకి వెళ్తే.. బిట్ల భరత్ 576 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, వి. కృతిక్ 573, జీ. సోను ప్రీతమ్ 571, బి. దేవకుమార్ 569, సిహెచ్. రంజిత్ 569, కె. హర్ష 564, సిహెచ్. విక్రమ్ 561, మరియు బి. శివ ప్రసాద్ 560 మార్కులతో సత్తా చాటారు. మొత్తంగా 17 మంది విద్యార్థులు 550కి పైగా, 24 మంది 540కి పైగా మార్కులు సాధించడం విశేషం. ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధ, కఠోర శ్రమకు విద్యార్థుల ప్రణాళికాబద్ధమైన కృషీ తోడవ్వడం వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైందని ప్రిన్సిపాల్ డా. తాడూరి రవీందర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థులను ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంజేపీ గురుకుల విద్యాలయాల ఆర్ సి ఓ మోతె రాజ్ కుమార్ ప్రత్యేకంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
