* ప్రాజెక్టు పరిస్థితి పరిశీలన
* వరద ఉధృతి తగ్గాకే మరమ్మతులకు అవకాశం
ఆకేరు న్యూస్ డెస్క్ : వరద ఉధృతికి తుంగభద్ర డ్యాము (ThungaBadra Dam) గేటు కొట్టుకుపోవడంపై కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government)అప్రమత్తమైంది. నిపుణులను సంప్రదించి పరిస్థితిపై ఆరా తీస్తోంది. గేటు మరమ్మతులు, ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంపై చర్చిస్తోంది. శనివారం రాత్రి 11 గంటలకు హోస్పేట వద్ద తుంగభద్ర డ్యామ్‌లో వరద తగ్గడంతో గేట్లను మూసివేస్తున్న క్రమంలో 19వ గేటు చైన్ లింక్ తెగి కొట్టుకుపోయింది. దీంతో డ్యామ్ నుంచి నీరు ఏకధాటిగా దిగువకు ప్రవహిస్తూనే ఉంది. ఇప్పటివరకు 2 లక్ష క్యూసెక్కుల వరకూ నీరు వృథాగా కిందికి పోయిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఒక్క గేటు విరిగి కొట్టుకుపోవడంతో.. తుంగభద్ర డ్యామ్ నుంచి 60 టీఎంసీల (TMC) నీరు వృథాగా పోనుందని తెలిపారు. మరోవైపు.. షిమోగలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు తుంగభద్ర డ్యామ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక తుంగభద్ర డ్యామ్ గేటు (Thunga Badra Dam Gate) కొట్టుకుపోవడంతో నీరు దిగువకు వరదలాగా ప్రవహిస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నదీపరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేశారు. వరద నేపథ్యంలో సురక్షితంగా ఉండాలని సూచించారు. తుంగభద్ర గేటు మరమ్మతులు పూర్తి చేసే వరకు సుంకేసుల ప్రాజెక్టు (Sunkesula Project) కు వరద ప్రవాహం కొనసాగనుందని అధికారులు వెల్లడించారు. వరద ఉధృతి తగ్గేవరకూ మరమ్మతులు చేసేందుకు అవకాశం లేదని పేర్కొంటున్నారు. ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీళ్లు బయటికి వదిలిన తర్వాతే గేటు పునరుద్ధరణ పనులు చేపడతామని తెలిపారు.
———————————-