
ఓరుగల్లు దశ తిరిగేనా..?
* డిసెంబర్ నాటికి వ్యాగన్ల ఉత్పత్తి ప్రారంభం
*నేడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాక
* కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పరిశీలించనున్న మంత్రి
* యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు
ఆకేరు న్యూస్ వరంగల్ ః కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (KISHAN REDDY )తో కలిసి కాజేపేట లోని అయోధ్యపురంలో నిర్మాణంలో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించనున్నారు. కేంద్ర మంత్రి పర్యటనపై సర్వత్రా ఆసక్తి ఎదురవుతోంది.. దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ( KAZIPET COACH FACTORY ) ప్రారంభంపై కచ్చితమైన తేదీని కేంద్ర మంత్రి ప్రకటిస్తారేమో అని నగర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం అయితే కొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుంది.
ఉత్తర దక్షిణ వారధి
కాజీపేట్ జంక్షన్ అనేది ఉత్తర భారతాన్ని దక్షిణ భారతాన్ని కలిపే వారధి. కాజీపేట జంక్షన్ దక్షణమధ్య రైల్వేలో సికింద్రాబాద్ తరువాత అతిపెద్ద జంక్షన్. సికింద్రాబాద్ తరువాత రైల్వేకు అత్యంత ఆదాయాన్ని ఇచ్చే కేంద్రం కాజీపేటనే. ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీయే కాదు కాజీపేటను డివిజన్ చేయాలనే డిమాండ్ కూడా దశాబ్దాల కాలంగా ఉంది.
దశాబ్దాల డిమాండ్
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలనే డిమాండ్ దశాబ్దాల కాలంగా ఉంది. 1969 తెలంగాణ తొలి దశ ఉద్యమ కాలం నుంచే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలనే డిమాండ్ ఉంది. దక్షణ మధ్య రైల్వేకు కావాల్సిన ప్యాసింజర్ కోచ్‌లను తమిళనాడులోని పెంబదూరు నుంచి తెప్పిస్తున్నారు. ఇది ఎంతో వ్యవయప్రయాసలతో కూడుకున్నది కాబట్టి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే అన్ని విదాలా లాభదాయకంగా ఉంటుందనే ఆలోచన రైల్వే అధికారులకు ఉంది. ఈ నేపధ్యంలోను దశాబ్దాల కాలం నుంచి కాజీపేట లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పడాలనే చర్చ జరుగుతూ ఉంది. కాజీపేటను రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలని అనేక ఉద్యమాలు జరిగాయి. కోచ్ ఫ్యాక్టరీ సాధనా సమితి ఆధ్వర్యంలో కోచ్ ఫ్యాక్టరీపై ఉద్యమాలు జరిగాయి. రాజకీయాలకతీతంగా జేఏసీ ఏర్పడి కోచ్ ఫ్యాక్టరీపై ఉద్యమించింది.
1982లో కోచ్ ఫ్యాక్టరీ మంజూరు
1982 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా గాంధి ప్రధానిగా ఉన్న సమయంలో కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసింది. ఆ తరువాత ఇందిరాగాంది హత్య జరిగిన నేపధ్యంలో పంజాబ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాజీపేటకు మంజూరైన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్ లోని కపుర్తలాకు తరలించారు. కోచ్ ఫ్యాక్టరీ వచ్చినట్టే వచ్చి చేజారిపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృఫ్తి నెలకొంది. అప్పటి నుంచి మళ్లీ ఉద్యమాలు కొనసాగాయి. ఈ నేపధ్యంలో 2007 లో మళ్లీ కాజీపేటకు వీల్ వర్క్ షాఫ్ ఏర్పాటు చేస్తన్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది కాని ఇతర రాజకీయ కారణాల వల్ల వీల్ వర్క్ షాప్‌ను కర్నాటకకు తరలించారు.మళ్లీ 2011లో ఎంపీ సిరిసిల్ల రాజయ్య అభ్యర్థన మేరకు అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ కాజీపేటలో వ్యాగన్ల రిపేర్ వర్క్ షాప్ నెలకొల్పేందుకు అంగీకరించి భూమి సేకరణ సర్వే జరపాలని కోరింది..
విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ అంశం
2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత విభజన చట్టంలో కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని కూడా పొందుపర్చారు.ఇండియన్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయాన్ని ఫిజిబిలిటీ బట్టి స్టడీ చేస్తుందని ఆ చట్టంలో పేర్కొన్నారు. 2014 తరువాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయి. 2016 లో బీజేపీ ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని పక్కన పెట్టి రైల్వే పిరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ మంజూరు చేసింది. దానికి 160 ఎకరాల భూమి అవసరం కాగా సరిపడా స్థలం అప్పగించడంలో అప్పటి బీఆర్ ఎస్ ప్రభుత్వం 8 ఏండ్లు తాత్సారం చేసింది. ఎట్టకేలకు అయోధ్య పురం వద్ద 162 ఎకరాల స్థలం కేటాయించడంతో పీవో హెచ్ పనులతో పాటు వ్యాగన్ మాన్యు ఫ్యాక్యరింగ్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. 2023లో జూన్ 8 న ప్రధాని నరేంద్ర మోదీ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.2025 డిసెంబర్ వరకు కోచ్ ల ఉత్పత్తి ప్రారంభొంచాలని కేంద్రం భావిస్తోంది.
యువతకు ఉపాధి
ఒకప్పుడు వరంగల్ నగరానికే తలమానికంగా ఉన్న ఆజాం జాహి మిల్లు మూత పడింది. ఆజాం జాహి మిల్లు ఉన్నప్పుడు పదివేల మందికి ఉపాధి లభించింది . ఆజాం జాహి మిల్లు మూత పడడంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. ఈ నేపధ్యంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం అయితే ఆరువేల మందికి ప్రత్యక్షంగా ఏడు వేల మందికి పరోక్షంగా ఉపాధి అభిస్తుందని అంటున్నారు. అంతే కాకుండా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పడిన నేపధ్యంలో దానికి అనుబంధంగా యువతకు ఇతర ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి.
మంత్రి పర్యటన పై సర్వత్రా ఆసక్తి
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా కోచ్ ఫ్యాక్టరీని సందర్శించనున్న నేపధ్యంలో నగర వాసుల్లో ఆసక్తి నెలకొంది. కోచ్ ఫ్యాక్టరీ పనుల పురోగతిని కేంద్ర మంత్రి స్వయంగా పరిశీలించనున్నారు. ఈ నేపధ్యంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడు పట్టాలెక్కనుందో తేదీని ప్రకటిస్తారని ఆశిస్తున్నారు.
——————————————–