Collector Chahat Bajpai Kazipet Permanent Bus Stand
* స్థల పరిశీలన చేసిన కలెక్టర్
ఆకేరు న్యూస్, హనుమకొండ : కాజీపేట పరిధిలో ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా, ప్రతిపాదిత శాశ్వత ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణానికి సన్నాహాలు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా బస్ స్టేషన్ నిర్మాణానికి ఉద్దేశించిన రైల్వే శాఖకు చెందిన భూములను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి గురువారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రస్తుతం నగర సిటీ బస్సుల సర్వీసులు కొనసాగుతున్న కాజీపేట రైల్వే స్టేషన్ ముందు భాగం, రైల్వే పాఠశాల స్థలం, రైల్వే స్టేడియం ప్రాంగణంతో పాటు స్టేడియానికి ఎదురుగా ఉన్న సుమారు ఎకరం విస్తీర్ణమున్న రైల్వే భూములను కలెక్టర్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అదేవిధంగా కాజీపేట ప్రధాన రహదారి పక్కన హైదరాబాద్ మార్గంలో వెళ్లే ఆర్టీసీ బస్సులు నిలిచే ప్రస్తుత బస్టాండ్ ప్రాంగణాన్ని కూడా ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో శాశ్వత బస్ స్టేషన్ నిర్మించేందుకు అవసరమైన రైల్వే స్థల సేకరణ, రైల్వే శాఖతో భూమి మార్పిడి (Land Exchange) ప్రక్రియను వేగవంతం చేయడం, భూ కేటాయింపుల్లో ఎదురయ్యే సాంకేతిక అంశాలపై ఆర్టీసీ, రెవెన్యూ మరియు రైల్వే అధికారులతో కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా మోడరన్ వసతులతో కూడిన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ ప్రతిపాదనలను త్వరగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఆర్టీసీ రీజినల్ మేనేజర్ (RM) భవానీ ప్రసాద్, డిప్యూటీ ఆర్ఎం కిషన్ రావు, డిపో మేనేజర్ (DM) ధరమ్ సింగ్, కాజీపేట తహసిల్దార్ రాజు, రైల్వే ఇన్స్పెక్టర్ ఆఫ్ వర్క్స్ శ్రీనివాస్, కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ రవీందర్ మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
