గెలవక పోతే.. నిలవలేం..
* అస్థిత్వమే బీఆర్ఎస్ అసలైన పోరాటం
* బలమైన అభ్యర్థులకే టికెట్లు
* సామాజిక సమీకరణాలపై దృష్టి
* బీసీ వర్గాలలకు పెద్దపీట ..
* కుటుంబ పార్టీ అప్రతిష్టకు దూరం
* ఎండాకాలం బీఆర్ ఎస్‌కు అనుకూలం
* ఇదే ..! బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహం
( చిలుముల్ల సుధాకర్ )
ఆకేరు న్యూస్ : బీఆర్ఎస్ పార్టీ అస్థిత్వ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా విస్తరిద్దామనుకున్న బీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్న గడ్డమీదనే ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. అధినేత కేసీఆర్‌కు పొర్లు దండాలు, సాష్టాంగ ప్రణామాలు చేసి స్వామి భక్తి లో తమను మించిన వారెవ్వరూ లేరని నిరూపించుకునే ప్రయత్నం చేసిన వారు .. పవర్ పోగానే పార్టీ మారేందుకు ముందు వరుసలోనిలబడ్డారు. అధికారం కోల్పోతే ఏం జరుగుతుందో భారత రాష్ట్ర సమితి ( BRS ) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( KCR ) గతంలో ఎన్నడూ లేనంతగా బోధపడుతోంది. 2004 ఎన్నికల ( ELECTIONS ) తర్వాత అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ద్వారా టీఆర్ఎస్ పార్టీ మొదటి సారి రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు వైయస్ పంచన చేరారు. అనివార్యమైన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి హుటాహుటిన బయటకు రావడం, తెలంగాణ కోసం ఉద్యమ బాట పట్టడం వల్ల ఆ సంక్షోభం నుంచి టీఆర్ఎస్ గట్టెక్కిగలిగింది. పార్టీ చీలిక నుంచి తప్పించుకోగలిగింది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఇలాంటి ఎన్నో ఆటుపోట్లు చూసినప్పటికి ఇంతటి రాజకీయ దుర్భర స్థితిని మాత్రం కేసీఆర్ ఎన్నడూ ఎదుర్కొనలేదన్నది రాజకీయ విశ్లేషకుల భావన. ఇపుడు తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు సామాన్య జనానికి కూడా ఈ విషయం అర్థం కానంత సంక్లిష్ట రాజకీయ అంశాలేమి కావు. గతంలో ఎన్నడూ లేని విదంగా కేసీఆర్ కుటుంబ సమస్య కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం (liquor scam delhi ) లో కూతురు కవిత ( Kalvakuntla Kavitha ) జైలు కెళ్ళడం కూడా కేసీఆర్ కు ఊహించని దెబ్బ. మానసికంగా ఎంతో ఇబ్బందికర పరిణామం. రాజకీయ చతురుడు, తిమ్మిని బమ్మి చేయగల రాజకీయ దురంధురుడు, అపర చాణక్యుడు అని వేనోళ్ళ పొగిడిన సొంత పార్టీ నాయకులే .. ఆయన విదానాల వల్లనే అధికారం అందకుండా పోయిందని చెప్పడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు . ఫ్యోన్ ట్యాపింగ్ ( Phone tapping ) కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న భయాందోళనలో ఉన్నారు. స్వీయ రక్షణ కోసం .. ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.. కాలం కలిసి రాకపోతే తాడు కూడా పామై కాటేస్తుందన్న చందంగా ఉంది. ఐకానిక్ భవనాలెన్నీ కట్టినా, దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలెన్నీ ప్రవేశపెట్టినా, కేంద్ర ప్రభుత్వ నివేదికలెంత కితాబునిచ్చినా ప్రజలు ఏ మాత్రం పట్టించుకోలేదు. కారణం కుటుంబ పెత్తనం, కుల పెత్తనం, ప్రజలకు దూరంగా పాలన ఉండడమని బీఆర్ఎస్ అధినేత కు బోధపడినట్లుంది. దిద్దు బాటు దిశగా చర్యలు చేపట్టినట్టు కనిపిస్తోంది. ఏ వర్గాలకు దూరంగా ఉన్నామో వారికి చేరువయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ వర్గాలకే ఎక్కువ సీట్లు కెటాయించారు. సామాజిక సమీకరణాల మేళవింపుగా దిశగా అడుగులు వేశారు. కుటుంబ పార్టీ అన్న అప్రదిష్టను తుడిచి వేసేందుకు కొంత ప్రయత్నించారు.
* గెలవకపోతే నిలవలేము..
ఓటమి పాఠాలను నేర్చుకుంటేనే భవిష్యత్ విజయాలను చూడగలమంటారు. విజయం సాధించినప్పుడు అంతా నావల్లే.. నా బుద్ది కుశలత వల్లే నని క్లెయిమ్ గేమ్ ఆడడం.. అపజయం పాలైతే .. నిజమైన కారణాలను విష్లేషించకుండా ప్రత్యర్థులో, పక్కవాళ్ళో కారణమంటూ బ్లేమ్ గేమ్ ఆడితే అధః పాతాళమే దిక్కవుతుందని పెద్దలు చెబుతుంటారు. ఇపుడు కేసీఆర్ మాత్రం క్లెయిమ్ గేమ్‌లకు, బ్లేమ్ గేమ్‌లకు దూరంగా అడుగులు కదుపుతున్నట్టు అర్థమవుతోంది. ఈ ఎన్నికల్లో గెలవకపోతే ఇక మనం నిలవలేము అన్న ఆలోచనలో ప్రణాళికలు సిద్దం చేసినట్లు కనిపిస్తోంది. ఇందుకోసం బీసీ కార్డును ఎంపిక చేసుకున్నట్టు అర్థమవుతోంది. తెలంగాణలో మొత్తం 17లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఐదు రిజర్వ్డ్ కేటగిరీలకు కెటాయించబడ్డాయి. రెండు ఎస్టీలకు, మూడు ఎస్సీలకు రిజర్వ్ అయినాయి. 12 జనరల్ స్థానాల్లో 6 స్థానాల్లో బీసీలకు అవకాశం ఇచ్చారు.
పద్మారావు గౌడ్ – సికింద్రాబాద్
గడ్డం శ్రీనివాస్ యాదవ్ – హైదరాబాద్
క్యామ మల్లేశ్ (కురుమ- యాదవ్ ) – భువనగిరి
అనిల్ కుమార్ ( బీసీ ) – జహీరాబాద్
బాజీరెడ్డి గోవర్దన్ (మున్నూరు కాపు ) – నిజామాబాద్
కాసానీ జ్ఞానేశ్వర్ ( ముదిరాజ్ ) – చేవెళ్ళ
బీసీ వర్గాల్లో కూడా సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్న సామాజిక వర్గాలకే ప్రాధాన్యత ఇచ్చారు. వ్యక్తిగతంగా అభ్యర్థులు సైతం ఆర్థిక పరిపుష్టి కలిగినవారు , రాజకీయంగా, సామాజికంగా ప్రజల్లో పేరున్న వక్తులకే ఈ సారి టికెట్లు ఇచ్చారు. హైదరాబాద్ అనగానే యాదవ, గౌడ సామాజిక వర్గాల పెత్తనమే ఉండేది. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఈ రెండు కులాల మద్దతు లేకుండా రాజకీయాలు కొనసాగలేదు. అదీ గుర్తించి ఈ రెండు సామాజిక వర్గాలకు టికెట్లు కెటాయించినట్లు కనిపిస్తోంది. సికింద్రాబాద్ లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించిన పద్మారావు ఇంతటి కష్ట కాలంలోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా వరుస విజయాలతో ప్రజలమద్య బలంగా ఉన్న నాయకుడు. సంఖ్యాపరంగా పెద్ద సంఖ్యలో ఉన్న మరో సామాజిక వర్గం ముదిరాజ్. ఈ వర్గానికే చెందిన కాసాని జ్ఞానేశ్వర్‌కు చేవెళ్ళ లోక్ సభ సీటు కెటాయించారు. నిజామాబాద్‌లో సైతం గతంలో కల్వకుంట్ల కవిత పోటీ చేసిన లోక్ సభ నియోజకవర్గానికి బాజిరెడ్డి గోవర్దన్‌కు బీఆర్ ఎస్ ఇచ్చింది. ఈయన ధర్మపురి అర్వింద్ సామాజిక వర్గానికే చెందిన కాపు సామాజిక వర్గానికే చెందినవాడు. స్థానికంగా చాలా పట్టున్న నాయకుడు కావడంతో గెలుపు అవకాశాలుంటాయని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. మిగిలిన జనరల్ స్థానాల్లో నలుగురు రెడ్డి , ఒకరు కమ్మ, ఒకరు వెలమ సామాజికవర్గానికి చెందిన వారున్నారు.
బోయినపల్లి వినోద్ కుమార్ ( వెలమ) – కరీంనగర్ ,
వెంకట్రామి రెడ్డి- మెదక్
నామా నాగేశ్వర్ రావు ( కమ్మ ) – ఖమ్మం
రాగిడి లక్ష్మారెడ్డి – మల్కాజిగిరి
మన్నె శ్రీనివాసరెడ్డి- మహబూబ్ నగర్
కంచర్ల కృష్ణారెడ్డి- నల్గొండ
ఇక ఐదు రిజర్వుడు స్థానాల్లో మూడు ఎస్సీలకు, రెండు ఎస్టీలకు కెటాయించబడ్డాయి. ఒక మాల, ఒక మాదిగ , మరొకటి మాదిగ ఆశ్రిత కులాలకు సంబందించిన బైండ్ల సామాజిక వర్గానికి కెటాయించారు.
కొప్పుల ఈశ్వర్ ( మాల )- పెద్దపల్లి
డాక్టర్ ప్రవీణ్ కుమార్ ( మాదిగ) – నాగర్ కర్నూల్
డాక్టర్ కడియం కావ్య ( మాదిగ- బైండ్ల )- వరంగల్
*ఎస్టీ నియోజక వర్గాల్లో ఒకటి లంబాడా, మరొకటి ఆదివాసీలకు కెటాయించారు.
మాలోత్ కవిత ( లంబాడా ) – మహబూబాబాద్
ఆత్రం సక్కు ( ఆదివాసీ ) – ఆదిలాబాద్
* వేసవి కాలం పైనే బీఆర్ ఎస్ ఆశలు ..
అభ్యర్థుల బలం మీదనే ఈ సారి బీఆర్ ఎస్ ఆశపడడం లేదు. వేసవి కాలం పైనే ఆధారపడుతోంది. మండు వేసవిలో వచ్చే ఎన్నికలు తమకు ఓట్లు ప్రకృతి ప్రసాదం అవుతుందని భావిస్తున్నారు. బీఆర్ ఎస్ పాలనా కాలంలో సాగు,తాగు, నిరంతర విద్యుత్ సరఫరా మీద ప్రత్యేక దృష్టి సారించామని చెబుతున్నారు. ఈ సారి తప్పని సరిగా సాగునీటికి సమస్యలు తలెత్తుతాయని భావిస్తున్నారు. మేడిగడ్డ కుంగిపోవడం వల్ల నీటిని ఎత్తిపోసే అవకాశం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. దీని వల్ల ఇప్పటికే వరి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పలు చోట్ల వందల ఎకరాల్లో వరి పంటలు ఎండిపోతున్నాయని టీఆర్ ఎస్ నాయకులు ఇప్పటికే చెబుతున్నారు. ఎండిన వరిపంటల దగ్గరకువెళ్ళి రైతులతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే పంటలు ఎండి పోతున్నాయని విమర్శలు సంధిస్తున్నారు. ఈ పరిస్థితి ఎప్రిల్ , మే నెలల్లో మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు. దీనికి తోడు కరెంట్ కట్, తాగునీటి కటకట కూడీ తీవ్రంగాఉంటుందని బీఆర్ ఎస్ నాయకులు అంటున్నారు. ప్రజలు బీఆర్ ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు మద్య తేడాను గుర్తించి తమకే ఓట్లు వేస్తారని భావిస్తున్నారు.. ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే…
———————
రెడ్డి, కమ్మ, వెలమ, యాదవ్ , ముదిరాజ్ , మాల మాదిగ ఈ కులాల వారికి టికెట్ లు ఇచ్చి ముస్లిం, క్రిస్టియన్ వద్ద ఏ ముఖం పెట్టు కొని వాస్తారండి ఈ నాయకులు.
అంతే కాకుండా మీడియా మిత్రులు కూడా ముస్లిం క్రిస్టియన్ అనే వారు కూడా ఈ దేశంలో మరీ ఈ రాష్ట్రంలో ఉన్నట్టుగా గుర్తించక పోవడం శౌచనీయం .
అందుకే ఓ గాయకుడు అన్నాడు
ఏ కులం అబ్బి నీ దేమతఅబ్బ …
కులం గజ్జి లాంటిది
మతం మత్తు లాంటిది
చివరీగా ఓ విన్నపం
మతాలకు కులాలకు అతీతంగా సమ సమాజ నిర్మాణం కోసం పాత్రికేయులు అనుకునే మనం కృషి చేయాలే.