ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం
ఆకేరు న్యూస్ :
హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ కు కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నందినగర్ లోని ఆయన నివాసానికి వెళ్లి మరీ నోటీసులు అందజేశారు. కొద్ది కాలంగా సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచారు. ప్రముఖ నేతలను సైతం విచారిస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఇటీవలే కేటీఆర్ ను కూడా అధికారులు విచారించారు. ప్రధానంగా ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులను సిట్ విచారించిన విషయం తెలిసిందే. తాజాగా.. కేసీఆర్‌నూ విచారించాలని సిట్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే తాజాగా కేసీఆర్‌కు నోటీసులు అందజేశారు. కేసీఆర్ విచారణతో రెండేళ్లుగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు తుది అంకానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సిట్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసి.. సీపీ సజ్జనార్ నేతృత్వంలో మార్పులు చేర్పులు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన పోలీస్ అధికారులను విచారించి, వారిని రిమాండ్‌కు తరలించారు. ఆ తరువాత ఫోన్ ట్యాపింగ్‌లో బాధ్యులుగా ఉన్నవారిని విచారించి వారి నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. రాధాకిషన్ రావు ఇచ్చిన కన్ఫేషన్ స్టేట్ మెంట్ లో కేసీఆర్ పేరుంది. ప్రభాకర్ రావు నియామకంలోనూ కేసీఆర్ పేరును భుజంగారావు ప్రస్తావించారు. ప్రభాకర్ రావు తరచూ ప్రగతిభవన్ వెళ్లి వచ్చేవారని భుజంగరావు తెలిపినట్లు తెలిసింది. ప్రభాకర్ రావు, భుజంగరావు వాంగ్మూలాల ఆధారంగానే సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించనున్నారు. కేసీఆర్ కు సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చారు
