Khairatabad By Election
* ఖైరతాబాద్ ఉప ఎన్నికపై “సర్” ప్రభావం
* భారీగా తగ్గిన ఓట్లు
* ఎవరికి లాభం.. ఎవరికి నష్టం
* లెక్కలు ప్రారంభించిన పార్టీలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ : ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుండడం ఖాయం కావడంతో రాజకీయం రసవత్తరంగా మారనుంది. రాజకీయాల సంగతి అటుంచితే.. ఈ ఎన్నికల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రభావం చూపనుంది. ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియపై నియోజకవర్గంలో చర్చ మొదలైంది.
ఒకవైపు ఉప ఎన్నిక మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భిన్నంగా సాగుతుందనే అంచనాలు వెలువడుతుంటే, మరోవైపు భారీగా గల్లంతవుతున్న ఓట్లు ఏ పార్టీ కొంపముంచుతాయోనన్న గుబులు ప్రధాన రాజకీయ పార్టీల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
* 1.23 లక్షల ఓట్లు తొలగింపు
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒకప్పుడు సుమారు 2.93 లక్షల ఓట్లు ఉండేవి. సర్ ప్రక్రియ అనంతరం నియోజకవర్గంలో ఏఎస్డీడీ (అబ్సెంట్, షిఫ్ట్, డెత్, డూప్లికేట్), ఇతర కారణాల పేరుతో ఏకంగా 1.23 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి.
దీంతో ముసాయిదా జాబితాలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గి 1.70 లక్షలకు పడిపోయింది. నో మ్యాపింగ్, ఎనామలీస్ జాబితాలో ఉన్న మరో 81 వేల మందికి నోటీసులు జారీ చేస్తుండటంతో, తుది జాబితా నాటికి ఈ సంఖ్య మరింత తగ్గి 1.50 లక్షల చుట్టూ తిరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తగ్గిన ఓట్లు.. ఎవరికి తూట్లు? అనే చర్చ జరుగుతోంది.
* దాదాపు సగం మాయం?
ఖైరతాబాద్ నియోజకవర్గంలో దాదాపు సగం మంది ఓటర్లు జాబితా నుంచి తొలగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే పూర్తి జాబితా అధికారికంగా ప్రకటించిన అనంతరం స్పష్టత రానునంది.
ముసాయిదా జాబితా ప్రకారం.. ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ ఓట్లు భారీగా కోతకు గురయ్యాయి. ఈ గల్లంతైన ఓటర్లలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సానుభూతిపరులు, కార్యకర్తలు ఉండటంతో ఏ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
* దానానికీ గుబులు
ఉప ఎన్నికలో దానం నాగేందర్ పోటీ చేయడం ఖాయం. గత ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు ఓటర్ల సంఖ్య దాదాపు సగం పడిపోవడంతో ఆయనకు కూడా గుబులై మొదలైనట్లు తెలుస్తోంది. అలాగే ఇతర రాజకీయ పార్టీలు, ఆశావహులు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా, లోలోపల తీవ్ర మథనానికి గురవుతున్నారు.
టికెట్ ఆశిస్తున్న ముఖ్య నాయకులు కొందరు ప్రత్యేక బృగాలను రంగంలోకి దించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు సరైన ధ్రువపత్రాలు సమర్పించేలా చూడటంతో పాటు, పేర్లు గల్లంతైన వారు కొత్తగా ‘ఫారం-6’ ద్వారా దరఖాస్తు చేసుకునేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
* గతానికి భిన్నంగా..
మారిన ఎన్నికల సమీకరణాలు: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన దానం నాగేందర్ ఇక్కడ విజయం సాధించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారీగా ఓట్ల తొలగింపు జరగడం, కొత్తగా ఫారం-6 దరఖాస్తులు పోటెత్తడం వంటి పరిణామాల వల్ల రాబోయే ఉప ఎన్నిక గతానికి భిన్నంగా, అత్యంత రసవత్తరంగా సాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
* సంప్రదాయ ఓటుకు గండిపడేనా?
ఓటర్ల తొలగింపు ప్రభావం అన్ని పార్టీలపై సమానంగా ఉంటుందా? లేక అధికార/ప్రతిపక్ష పార్టీల సంప్రదాయ ఓటు బ్యాంకుకు గండి పడుతుందా? అనే దానిపైనే ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది.
ఏ పార్టీ అయితే ఈ ఓటర్ల సవరణ ప్రక్రియను సమర్థవంతంగా ఉపయోగించుకుని, తొలగిపోయిన తమ మద్దతుదారుల ఓట్లను తిరిగి చేర్పిస్తుందో, వారికే ఉప ఎన్నికలో స్పష్టమైన ఆధిక్యత లభించే అవకాశం ఉంది. ఆ దిశగా దానం నాగేందర్ ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
