* వీడని చిక్కుముడి
* పట్టుబడుతున్న ఇద్దరు కీలక నేతలు
* బెంగళూరుకు పంచాయితీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలు ఒక్కొక్కరిగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కానీ, అధికార పార్టీ కాంగ్రెస్లో ఇంకా మూడు స్థానాలకు అభ్యర్థులు ఖరారు కాలేదు. అధికారికంగా అభ్యర్థుల ప్రకటన రాలేదు. అవే.. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్. వీటిలో రెండు స్థానాల విషయంలో అభ్యర్థుల అంశం కొలిక్కి వచ్చినా.. ఖమ్మం మాత్రం హీట్ సీటుగా మారింది.
బెంగళూరుకు నేతలు
ఖమ్మం సీటును మంత్రి పొంగులేటి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి కేటాయించినట్లు గా ప్రచారం జరిగినా, ఇంకా కొలిక్కిరాలేదు. అయితే.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం సీటు విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి సీటు కావాలని పట్టుబడుతున్నారు. మరోవైపు.. తన భార్య నందినికి కాకపోతే రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబడుతున్నారు. దీంతో వీరి పంచాయితీ ఇప్పుడు బెంగళూరుకు చేరినట్లు తెలుస్తోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ వద్ద ఖమ్మం సీటుపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారం కొలిక్కి వస్తే.. మూడు సీట్లను ఒకేసారి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నారు. నామినేషన్ల దాఖలుకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఈరోజే ఈ అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
——————-