* ప్లాస్టిక్ నియంత్రణ పాటించాలి
* గత నాలుగు నెలల నుంచి కలెక్టరేట్ లో ప్లాస్టిక్ నిషేధం
-హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఆకేరు న్యూస్, హనుమకొండ : సమస్త ప్రాణకోటికి ఆధారమైన భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొని మాట్లాడుతూ ప్లాస్టిక్ తో పాటు పర్యావరణానికి పెనుముప్పును కలిగించే అనర్ధాలను నియంత్రించినప్పుడే ధరిత్రి బాగుంటుందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గత నాలుగు నెలల నుండి కలెక్టరేట్ లో ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడంలో అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. ప్లాస్టిక్ నియంత్రణతో పాటు తడి, పొడి చెత్త నిర్వహణ పట్ల అవగాహన అవసరమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డీఆర్ డీవో ఆధ్వర్యంలో పర్యావరణ హితమైన సంచులను కలెక్టర్ చేతుల మీదుగా వివిధ శాఖల అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్ర, డీఆర్ఓ వై.వి. గణేష్, డీఆర్ డీ ఓ నాగ పద్మజ, జిల్లా సంక్షేమ అధికారి కె.మధురిమ, అదనపు డీఆర్ డీవో శ్రీనివాస రావు, వ్యవసాయ జెడి రవీందర్ సింగ్, జిల్లా సహకార శాఖ అధికారి నాగేశ్వరరావు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్. ప్రవీణ్ కుమార్, జిల్లా స్వచ్ఛ భారత్ కో ఆర్డినేటర్ పసునూరి సంపత్ కుమార్,ఇతర అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు,సిబ్బంది పాల్గొన్నారు.
—————————