ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ఎన్నికలు, (బాక్సులో) 1.50 కోట్లు ఆఫర్ చేసిన ఎంబీబీఎస్ విద్యార్థిని విశ్వశ్రీ ప్రియ
* ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు..
* గ్రామాభివృద్ధి కోసం భారీ విరాళాల ప్రకటనలు
ఆకేరు న్యూస్, నెట్వర్క్ : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల వేళ (AP Panchayat Elections 2026) గ్రామాల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సర్పంచ్ ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే గ్రామాభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు అందిస్తామని పలువురు ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది.
ఒకరు రూ.50 లక్షలు ఇస్తానని ప్రకటించగా.. మరొకరు ఎకరం పొలం ఇస్తానని హామీ ఇచ్చారు. తాజాగా మరో యువతి ఏకంగా రూ.1.50 కోట్లు విరాళంగా అందిస్తానని ప్రకటించడం అందరి దృష్టిని విశేషంగా ఆకట్టుకుంది.
* ఏకగ్రీవం చేస్తే రూ.1.50 కోట్లు..
తూర్పుగోదావరి (East Godavari) జిల్లా కడియం మండలం దుళ్ళ గ్రామంలో మాజీ సర్పంచ్ దూడల నాగేశ్వరరావు కుమార్తె ఎంబీబీఎస్ విద్యార్థిని విశ్వశ్రీ ప్రియ తన ప్రకటనతో వార్తల్లో నిలిచారు. గ్రామ ప్రజలు తనను సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎంపిక చేసి అవకాశం కల్పిస్తే గ్రామాభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.1.50 కోట్లు విరాళంగా అందిస్తానని ఆమె ప్రకటించారు.
* తోకల శ్రీనివాస్ కోటి విరాళం..
ఇటీవల దుళ్ళ గ్రామ మాజీ ఉపసర్పంచ్ తోకల శ్రీనివాస్ కూడా సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేస్తే గ్రామాభివృద్ధికి రూ.కోటి విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ఈ ప్రకటనపై స్పందించిన విశ్వశ్రీ ప్రియ తన వంతుగా మరింత మొత్తం అందించేందుకు సిద్ధమని వెల్లడించారు.
* తల్లిదండ్రుల ఆశయాలు కొనసాగిస్తా : విశ్వశ్రీ ప్రియ
తన తండ్రి దివంగత దూడల నాగేశ్వరరావు, తల్లి రత్నం గతంలో గ్రామ సర్పంచ్‌లుగా పనిచేసి దుళ్ళ గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేశారని విశ్వశ్రీ ప్రియ తెలిపారు. వారి సేవా స్ఫూర్తి, ఆశయాలను కొనసాగిస్తూ గ్రామానికి సేవ చేయాలన్నది తన ఆకాంక్షగా పేర్కొన్నారు.
* 1.50 కోట్లు విరాళంగా అందించేందుకు సిద్ధం..
మరో ఏడాదిలో తన ఎంబీబీఎస్ విద్య పూర్తవుతుందని, ఆ తర్వాత గ్రామ ప్రజల సహకారంతో ప్రజాసేవలో భాగస్వామ్యం కావాలని భావిస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు తనకు సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. తనను ఏకగ్రీవంగా ఎంపిక చేస్తే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.1.50 కోట్లు విరాళంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
* 50 లక్షలు.. ఎకరం పొలం ఆఫర్..
ఇదిలా ఉండగా పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంలోనూ ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది. సర్పంచ్ పదవికి పలువురు అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో గ్రామంలో ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చులు పెరగడంతో పాటు వర్గ విభేదాలు తలెత్తే అవకాశముందని గ్రామ పెద్దలు భావించారు.
ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా సమావేశమైన గ్రామ పెద్దలు ఏకగ్రీవ ఎన్నికపై అభ్యర్థులతో చర్చింంచారు. గ్రామాభివృద్ధికి ఎవరు ఎంతమేరకు సహకరిస్తారనే ప్రశ్నకు ఒక అభ్యర్థి రూ.50 లక్షలు ఇస్తానని ముందుకు రాగా, మరో అభ్యర్థి ఎకరం పొలం ఇస్తానని ఆఫర్ చేశారు.
* ఏకగ్రీవానికి మొగ్గు చూపుతారా..?
సాధారణంగా పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections 2026) సమయంలో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీలు ఇస్తుంటారు. అయితే ఈసారి కొన్ని గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే గ్రామాభివృద్ధికి భారీ మొత్తంలో విరాళాలు అందిస్తామని ప్రకటనలు రావడం ప్రత్యేక చర్చకు దారితీస్తోంది.
* అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆఫర్లు..
ఒకవైపు రూ.50 లక్షలు, మరోవైపు ఎకరం పొలం, ఇంకోవైపు రూ.1.50 కోట్ల విరాళం.. ఇలా గ్రామాభివృద్ధి కోసం ముందుకొస్తున్న ప్రకటనలు ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ఈ హామీలు ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయి? గ్రామ ప్రజలు ఎవరికి అవకాశం కల్పిస్తారు? ఏకగ్రీవ ఎన్నికలు సాధ్యమవుతాయా? అన్నది వేచి చూడాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

