Konda Surekha Political Decision
* వరంగల్‌లో అనుచరులతో భేటీ
* కొన్ని గంటల్లో వీడనున్న ఉత్కంఠ
ఆకేరు న్యూస్, వరంగల్ : మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ సీఎం రేవంత్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం లేపిన సంగతి తెలిసిందే. సుస్మిత వ్యాఖ్యలు ఆమె తల్లి సురేఖకు పెద్ద తలనొప్పిగా మారాయి. చివరికి ఆమె మంత్రి పదవికే ఎసరు వచ్చింది. అంతే కాదు పార్టీలోనూ సురేఖ స్థానంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మంత్రి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పార్టీలోనే కొనసాగుతారా ? మంత్రి పదవి, పార్టీకి ఒకేసారి గుడ్‌బై చెబుతారా ? లేక అధిష్ఠానం బర్తరఫ్ చేసేంత వరకు ఆగి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరుగుబాటు బావుటా ఎగరేస్తారా ? అనే ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠగా మారాయి. ఆ తదుపరి ఆమె తీసుకునే నిర్ణయాలు ఏంటి ? బీఆరఎస్, బీజేపీ పార్టీల్లోకి వెళ్లే చాన్స్ ఉందా ? గతంలో సురేఖ బీఆరఎస్‌లో చేరి ఎమ్మెల్యే అయిన విషయం తెలిసిందే. బీజేపీ అగ్ర నాయకులు కొండ దంపతులతో చేరికపై చర్చించినట్లుగా వార్తలు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో కొండ దంపతులకు మంచి ఆదరణ ఉంది. ఉమ్మడి జిల్లాలోని ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేసినా గెలిచే సత్తా వారి సొంతంగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంత బలమైన నాయకులను కాంగ్రెస్ వదులుకుంటుందా ? లేక ఏ పార్టీలోకి వెళ్లకుండా స్వతంత్ర పార్టీ ఏర్పాటు చేస్తారా ? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బై ఎలక్షన్లో తమ సత్తా చాటాలని భావిస్తారా ? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కొన్ని గంటల్లో తేలనుంది. మిత్రులను శత్రువులుగా మార్చుకుంటే పార్టీకే నష్టం అని, కాంగ్రెస్‌లో ఇలాంటివి సాధారణమే అని టీ కప్పులో తుపాన్‌లా మారిపోతుందా ? రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం గానీ, శాశ్వత మిత్రుత్వం గానీ ఉండదని నానుడి.
తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్న ఈ ఎపిసోడ్ ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకుంది. ఢిల్లీ పర్యటనను ముగించుకుని తిరిగొచ్చిన కొండా సురేఖ, నేడు వరంగల్‌లో తన ముఖ్య అనుచరులు, నియోజకవర్గ స్థాయి నేతలతో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీ తర్వాత ఆమె తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై సంచలన ప్రకటన చేసే అవకాశముంది. ఇటీవలే ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తన వైఖరిని స్పష్టంగా వివరిస్తూ, తన పదవికి రాజీనామా చేసేది లేదని తేల్చిచెప్పారు. అయితే, అధిష్ఠానం తనపై ఎలాంటి చర్యలు తీసుకునే ముందే.. ముందస్తుగా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలనే ఆలోచనలో సురేఖ ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఢిల్లీలో జరిగిన పరిణామాలు, అధిష్ఠానానికి తాను తేల్చిచెప్పిన విషయాలను ఈ సమావేశంలో తన అనుచరులకు వివరించనున్నారు. ప్రజాభిప్రాయం, కార్యకర్తల నిర్ణయం మేరకే తదుపరి అడుగు ఉంటుందని కొండా సురేఖ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అనుచరుల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం, నేడు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించి తన నిర్ణయాన్ని మీడియా ముఖంగా అధికారికంగా ప్రకటించే అవకాశముంది. దీంతో వరంగల్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
