
* ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు చేశానని మురళినే చెప్పారు
* అది రాజ్యాంగాన్ని అవమానపరచడమే
* ఎన్నికల కమిషనర్ కు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని ఫిర్యాదు
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ(KONDA SUREKHA)ను అనర్హురాలిగా ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ (NANNAPUNENI NARENDER_ ఫిర్యాదు చేశారు. కాసేపటి క్రితం హైదరాబాద్ (HYDERABAD)లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఆయన రాష్ట్ర ఎన్నికల ఉప ప్రధాన అధికారి హరి సింగ్ (HARI SINGH)ను కలిశారు. కొద్ది రోజుల క్రితం కొండా మురళి చేసిన వ్యాఖ్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నన్నపునేని మాట్లాడుతూ “కొండా మురళి ఎన్నికల కోసం 70 కోట్లు ఖర్చు చేశానని చెప్పడం అనేది చాలా తీవ్రమైన అంశం. ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించే విధంగా ఉంది. ఒక అభ్యర్థి వ్యక్తిగతంగా కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధమే కాకుండా, ఎన్నికల లోపాలను ఎత్తిచూపే అంశం కూడా. ఇది ఓటర్లను ప్రలోభపెట్టడం, డబ్బుతో ఓట్లు కొనడం వంటి అంశాలకే సంకేతంగా కనిపిస్తోంది. ఈ వ్యాఖ్య ద్వారా ప్రజలకు అసలైన సేవ చేయాలనే లక్ష్యం కాదని, పదవి కోసం డబ్బును పెట్టుబడిగా చూస్తున్న మెంటాలిటీ స్పష్టమవుతోంది.. ఈ తరహా వ్యాఖ్యలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి, న్యాయ ప్రక్రియ ద్వారా విచారణ జరిపించాలి. ప్రజాస్వామ్యంలో ఈ రకమైన డబ్బు రాజకీయాలను ఖండించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి” అని ఎన్నికల కమషన్ కోరినట్లు తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ (BRS) రాష్ట్ర కార్యదర్శి, పార్టీ లీగల్ కన్వీనర్ భరత్ కుమార్, విద్యార్థి నాయకులు, తెలంగాణ రాష్ట్ర మాజీ టెక్నికల్, కమ్యూనికేషన్ చైర్మన్ రాకేష్ ఉన్నారు.
………………………………….