KTR Criticism CM Revanth Reddy
* విధ్వంసం.. వినాసనం తప్ప.. అభివృద్ధి శూన్యం
* అంతా తిరోగమనమే.. పురోగమనం లేదు..
* కాళేశ్వరం మీద కక్ష.. రైతుకు శిక్ష..
* అసమర్థత ప్రో మ్యాక్స్ – అవినీతి అల్ట్రా మ్యాక్స్
* ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగిన కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంలో, సీఎం రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చెంచాగిరి చేస్తూ తెలంగాణ ప్రాజెక్టులను, జల ప్రయోజనాలను పక్కనబెడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజా పాలన సాగడం లేదని, ఇది వెయ్యి రోజుల శని పాలన అని విమర్శించారు. తెలంగాణలో ఆర్థిక, సామాజిక విధ్వంసం, వినాశనం తప్ప అభివృద్ధి శూన్యమని, పురోగమనం లేకపోగా అంతా తిరోగమనమే కనిపిస్తోందని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ రైతాంగానికి తీవ్ర శిక్ష వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం “అసమర్థత ప్రో మ్యాక్స్ – అవినీతి అల్ట్రా మ్యాక్స్” తరహాలో నడుస్తోందని ఎద్దేవా చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి ప్రభుత్వ వైఫల్యాలపై చార్జ్‌షీట్ విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
* అసమర్థత ప్రో మ్యాక్స్ – అవినీతి అల్ట్రా మ్యాక్స్
ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్.. రేవంత్ రెడ్డి పాలన “అసమర్థత ప్రో మ్యాక్స్, అవినీతి అల్ట్రా మ్యాక్స్, అరాచకం ఐ మ్యాక్స్” మోడల్లో సాగుతోందని ధ్వజమెత్తారు. వెయ్యి రోజులుగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపిస్తోందన్నారు. కేవలం వెయ్యి రోజుల్లోనే మంత్రులు, ముఖ్యమంత్రి రూ.4.5 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, రియల్ ఎస్టేట్ రంగాన్ని సంపూర్ణంగా కుప్పకూల్చి అన్ని వర్గాల జీవితాలను ఆగాం చేశారని ఆరోపించారు.
* జలద్రోహం చేస్తే ఖబడ్దార్
తెలంగాణ నీటి ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనబెట్టి తీవ్ర జలద్రోహానికి పాల్పడుతోందని కేటీఆర్ విమర్శించారు. “చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉత్తరాలు రాసిన మాజీ అధికారి ఆదిత్యనాథ్ దాస్‌ను సలహాదారుగా పెట్టుకుంటే మన రాష్ట్రానికి ఎలా న్యాయం జరుగుతుంది?” అని ప్రశ్నించారు. చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి, కృష్ణా జలాలను కట్టబెట్టే కుట్ర జరుగుతోందన్నారు. ఎస్ఎల్బీసీ ఛానెల్, చెక్ డ్యామ్‌లు కుప్పకూలినా కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఎస్ఏ కనీసం నోరు మెదపడం లేదని, జీఆర్ఎంబీ సమావేశాల్లో తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేసే ఎజెండా పెడితే కాంగ్రెస్ నాయకులు పారిపోతున్నారని మండిపడ్డారు. కాఫర్ డ్యామ్ నిర్మాణంపై ఉచిత సలహా ఇచ్చిన ఇంజనీర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ బెల్టు ట్రీట్మెంట్ ఇస్తామని బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. జలద్రోహం చేస్తే తమ ప్రభుత్వం వచ్చాక తగిన బుద్ధి చెబుతాం ఖబడ్దార్ అని హెచ్చరించారు.
* కాళేశ్వరంపై కక్ష – రైతు సంక్షేమానికి శిక్ష
రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రూ.50 వేల కోట్లతో పూర్తి రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్లు పెట్టి, కేవలం రూ.20 వేల కోట్లతో చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో నిరంతరాయంగా సాగిన రైతుబంధు బంద్ అయిపోయిందని, రాహుల్ గాంధీకి పంపే ‘మూటల బంద్’ మాత్రం బ్రహ్మాండంగా నడుస్తోందని ఎద్దేవా చేశారు. నాడు కేసీఆర్ మోటార్లకు మీటర్లు పెట్టబోమని తెగేసి చెప్తే, నేడు రేవంత్ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతూ ‘రైతు డిస్కం’ పేరుతో మోటార్లకు మీటర్లు బిగిస్తోందన్నారు.
* రైతులపై లాఠీచార్జీలు
సాగునీరు అడిగితే కోసి రక్తం చల్లమంటున్నారని, యూరియా కోసం నిలబడిన రైతులపై లాఠీచార్జీలు చేయిస్తున్నారని వాపోయారు. కాళేశ్వరంపై కక్షకట్టి రైతాంగానికి శిక్ష వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ, స్థానిక నాయకులు వచ్చి నిరుద్యోగులకు నమ్మబలికిన 2 లక్షల ఉద్యోగాలు, రూ.4,000 నిరుద్యోగ భృతి ఏమయ్యాయని కేటీఆర్ నిలదీశారు. జాబ్ క్యాలెండర్ లేకపోగా, ఉద్యోగాలు అడిగిన యువతపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని, ఈ ‘దండుపాళ్యం బ్యాచ్’ ప్రభుత్వానికి నిరుద్యోగులే వచ్చే ఎన్నికల్లో పిండాలు పెడతారన్నారు. అటు కళ్యాణలక్ష్మి, తులం బంగారం హామీలను నీరుగార్చడమే కాకుండా, జాబితాలో భారీగా కోతలు విధించారన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
