
Danam Nagendar, KTR
* దానం నాలాను మింగేశారు..
* కేటీఆరే వందల ఎకరాలు తినేశారు..
ఆకేరున్యూస్, హైదరాబాద్:
సికింద్రాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ( Danam Nagendar ) , మాజీ మంత్రి కేటీఆర్ ( KTR ) మధ్య కబ్జాలపై వార్ జరుగుతోంది. ఓ చానల్ వేదికగా దానంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. నాగేందర్ తమ పార్టీలో ఉన్నంత కాలం ఆయన ఇంటి వెనుక ఉన్న 700 గజాల నాలా స్థలం కబ్జాకు ప్రయత్నించారని కేటీఆర్ ఆరోపించారు. దానికి తాము అంగీకరించలేదన్నారు. మొన్నటి వరకూ ఇది ప్రభుత్వ స్థలమని అక్కడ బోర్డులు ఉండేవి, ఇప్పుడు లేవని విమర్శించారు. కేటీఆర్ ఆరోపణలపై దానం స్పందించారు. కేటీఆర్ లాంటి పెద్ద నాయకులు అవగాహనతో మాట్లాడాలని దానం నాగేందర్ అన్నారు. వాళ్ల మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి.. 20ఏ పేరిట స్థలాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, పుప్పాలగూడలో వందల ఎకరాలు, శంకరహిల్స్ లో 300 ఎకరాలు కబ్జాలు చేశారని నాగేందర్ ఆరోపించారు. ఇక్కడ పుట్టి పెరిగిన తనకే ఎక్కువ సమాచారం ఉంటుందని, బతకడానికి వచ్చిన వాళ్లకు సరైన సమాచారం తెలియదని కేటీఆర్‌ను ఉద్దేశించి దానం అనడం గమనార్హం.
————————