Telangana Movement Students Support
* ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి కేయూ విద్యార్థుల మద్దతు
* కాకతీయ యూనివర్సిటీని పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకోవాలని విజ్ఞప్తి
* ఉద్యమకారుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే
ఆకేరు న్యూస్, హనుమకొండ: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీని స్వాగతిస్తూ కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమకారులు కేయూ గెస్ట్ హౌస్‌లో సమావేశం నిర్వహించారు. అనంతరం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ( Naini Rajender Reddy )ను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి పలు డిమాండ్లపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పూర్వ కేయూ జేఏసీ చైర్మన్ డా. సాదు రాజేష్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో విద్యార్థులు చదువులు, ఉద్యోగ అవకాశాలను పక్కనబెట్టి రాష్ట్ర సాధన కోసం పోరాడారని తెలిపారు. కేసులు, అరెస్టులు, లాఠీచార్జీలు ఎదురైనా వెనక్కి తగ్గలేదన్నారు.
జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అమలవుతున్న విధంగా తెలంగాణ ఉద్యమకారులకు కూడా ప్రత్యేక రిజర్వేషన్లు, వయోపరిమితి సడలింపులు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే కాకతీయ యూనివర్సిటీని పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని ముందుగా కేయూ విద్యార్థి ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరారు.
ఉద్యమ సమయంలో నమోదైన కేసులను ఎత్తివేయడంతో పాటు హెల్త్ కార్డులు, విద్యలో రిజర్వేషన్లు, 250 గజాల స్థలం, ఇందిరమ్మ ఇల్లు, రూ.5 లక్షల భృతి వంటి హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఉద్యమకారుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
