లష్కరే తోయిబా కమాండర్ మహమ్మద్ లతీఫ్ భట్ (ఫైల్) హతం, ఉగ్రవాదులు
* మసీదులో తలదాచుకున్న ఉగ్రవాది
* రూ.15 లక్షల రివార్డు ఉన్న మోస్ట్ వాంటెడ్
ఆకేరు న్యూస్, డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన (Kulgam Encounter) ఆపరేషన్‌లో లష్కరే తోయిబా కమాండర్ మహమ్మద్ లతీఫ్ భట్ (Mohammad Latif Bhat) హతమయ్యాడు. దేవ్సర్ ప్రాంతంలోని జంగల్పోరాలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
భద్రతా బలగాలు అతడిని చుట్టుముట్టి లొంగిపోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో అతడు మరణించినట్లు కుల్గామ్ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
* మసీదులో తలదాచుకున్న ఉగ్రవాది..
నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో జమ్మూకశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా జంగల్పోరా ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో లతీఫ్ భట్ ఓ మసీదులోకి వెళ్లి తలదాచుకున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. అతడిని ప్రాణాలతో పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నించారు.
కుల్గామ్ ఎస్పీ అనయత్ అలీ చౌదరి, 9 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ వీడియో కాల్ ద్వారా అతడితో మాట్లాడి లొంగిపోవాలని కోరారు. ఆయుధాలు విడిచిపెట్టి బయటకు రావాలని సూచించినా లతీఫ్ అంగీకరించలేదు. మసీదు ఉన్న ప్రాంతం కావడంతో భద్రతా బలగాలు ఆచితూచి వ్యవహరించాయి. ప్రార్థనా స్థలానికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఆపరేషన్ కొనసాగించాయి. చివరకు జరిగిన ఎదురుకాల్పుల్లో లతీఫ్ భట్ హతమైనట్లు అధికారులు వెల్లడించారు.
* సీఆర్పీఎఫ్ చెక్‌పోస్టుపై దాడి కేసులో కీలక నిందితుడు
నవంబర్ 11న కుల్గామ్‌లోని అఖ్రాన్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. ఈ దాడికి ముందు లతీఫ్ భట్ (Mohammad Latif Bhat), అతడి సహచరుడు ఉమర్ నిసార్ దార్ పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానించారు. మీర్ బజార్, అఖ్రాన్, హబ్లిష్, కిలాం ప్రాంతాల్లో వారి కదలికలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను దర్యాప్తు అధికారులు పరిశీలించారు.
* సహచరుడు ముందే హతం..
లతీఫ్ భట్‌కు సహకరిస్తున్నట్లు అనుమానించిన ఉమర్ నిసార్ దార్ నవంబర్ 16న కుల్గామ్‌లోని లారూ బైపాస్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఆ సమయంలో లతీఫ్ భట్ భద్రతా బలగాల వలయం నుంచి తప్పించుకున్నాడు. దీంతో అతడి కోసం పోలీసులు, భద్రతా సిబ్బంది గాలింపును ముమ్మరం చేశారు. బుధవారం జంగల్పోరాలో మళ్లీ అతడి ఆచూకీ లభించడంతో తాజా ఆపరేషన్ చేపట్టారు.
* రూ.15 లక్షల రివార్డు..
కశ్మీర్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న లతీఫ్ భట్ ఆచూకీ తెలిపిన వారికి జమ్మూకశ్మీర్ పోలీసులు రూ.15 లక్షల రివార్డు ప్రకటించారు. అనంతనాగ్‌లో పోలీసు హెడ్ కానిస్టేబుల్ హత్య, కుల్గామ్‌లో వలస కార్మికుల హత్య ఘటనలతోపాటు పలు దాడుల్లోనూ అతడి ప్రమేయం ఉన్నట్లు భద్రతా సంస్థలు అనుమానించాయి.
లతీఫ్ భట్ హతం కావడాన్ని కుల్గామ్ (Kulgam Encounter) పోలీసులు కీలక విజయంగా అభివర్ణించారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

