
– పిల్లలపైనా అఘాయిత్యాలు
– పోక్సో కేసుల నమోదులో కమిషనరేట్ టాప్
– అత్యల్పం కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో చిన్నారులపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పసివాళ్లని కూడా చూడకుండా వారిపై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాల్లో ఈ విషయం స్పష్టమవుతోంది. 2020 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీ వరకు తెలంగాణలో మొత్తం 16,994 పోక్సో కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 2,619 కేసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే ఉన్నాయి. అత్యల్పంగా కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో 125 కేసులు నమోదు అయ్యాయి. పోక్సో కేసులకు సంబంధించి 16,994 కేసులు నమోదు కాగా మొత్తం నిందితులు 24,613 మంది ఉన్నారు. వీరిలో కేవలం 15,634 మందిని మాత్రమే పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో కేసులకు సంబంధించి ఇంకా 8,979 మంది అరెస్టు కాలేదు. ఈ తరహా కేసుల్లో శిక్షలు పడినవి 188 మాత్రమే. 12,771 కేసులు పెండింగ్ ట్రయల్లోనే ఉన్నాయి. మిగతా కేసుల్లో చార్జీషీట్లు దాఖలు కాలేదని తెలంగాణ మహిళా భద్రతా విభాగం అధికారులు కూడా పేర్కొంటున్నారు.
……………………………………………