Madhavapeddi Suresh, Kinnera Balu Music Award,
* రవీంద్రభారతి వేదికగా ప్రదానం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో విఖ్యాత గాయకుడు, పద్మవిభూషణ్ డాక్టర్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరో వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్‌కి ప్రతిష్టాత్మక ‘కిన్నెర-బాలు సంగీత పురస్కారాన్ని’ ప్రదానం చేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాంతా బయోటెక్ అధినేత, పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి దంపతులు, ప్రముఖ వ్యాపారవేత్త భోగరాజు మూర్తిలతో కలిసి మాధవపెద్ది సురేష్ దంపతులను ఘనంగా సత్కరించారు.
నాటి.. నేటి సంగీతానికి వారధి
ఈ సందర్భంగా డాక్టర్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… నాటి శాస్త్రీయ బాణీని, నేటి ఆధునిక బీట్ సంగీతాన్ని మేళవించిన అద్భుత వారధిగా మాధవపెద్ది సురేష్ నిలుస్తారని కొనియాడారు. అంచెలంచెలుగా ఎదిగిన సురేష్ సంగీత ప్రపంచంలో తన స్థానాన్ని పదిలం చేసుకున్న మధుర స్వరకర్త అని ప్రశంసించారు. ఎస్పీ బాలు ఉత్తమ సంస్కారి అని, ఆయన పాట కన్నా మాటలోనే ఎంతో మాధుర్యం ఉండేదని గుర్తుచేసుకుంటూ, కరోనా సమయంలో అనవసర వైద్యం వల్లే ఆయన మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.
బాలుతో కలిసి నటించడం..
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణచారి మాట్లాడుతూ… ఎస్పీ బాలు కథానాయకుడికైనా, హాస్య నటుడికైనా తన స్వరంలో వైవిధ్యం చూపిస్తూ పాడగల దిట్ట అని కొనియాడారు. బాలుతో కలిసి ‘దేవస్థానం’ సినిమాలో నటించడం తన భాగ్యంగా భావిస్తున్నానన్న అన్నారు. తాను సాంస్కృతిక శాఖ అధికారిగా ఉన్న సమయంలోనే సురేష్ నాలుగు ప్రభుత్వ నంది అవార్డులు అందుకోవడం విశేషమన్నారు.
ఆకట్టుకున్న గీతాలు
సభకు స్వాగతం పలికిన కిన్నెర రఘురామ్ మాట్లాడుతూ… తమ సంస్థలో బాలు అనేక కార్యక్రమాలు నిర్వహించారని, సురేష్ కూడా ఆరు ప్రోగ్రామ్స్ చేశారని తెలిపారు. అంతకుముందు మాధవపెద్ది సురేష్ సంగీత దర్శకత్వంలో గాయకులు ధనంజయ్, బంటి, సాయిచరణ్, నిత్యసంతోషి, హరిప్రియ, విజయలక్ష్మి తదితరులు ఆలపించిన పలు మధుర గీతాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
