Ganesh Laddu Auction
* హైదరాబాద్‌లో వెల్లివిరిసిన మతసామరస్యం
* ఘనంగా గణేష్ లడ్డూల వేలం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గణేశ్ నవరాత్రి ఉత్సవాల వేళ హైదరాబాద్ లో మతసామరస్యం వెల్లివిరిసింది. ఒకవైపు కులమతాలకు అతీతంగా భక్తులు ఉత్సవాల్లో పాల్గొంటూ ఉండగా, మరోవైపు వినాయకుడి లడ్డూ వేలంలో ఓ ముస్లిం భక్తుడు పాల్గొని ప్రసాదాన్ని దక్కించుకోవడం అందరినీ ఆకట్టుకుంది. బడంగ్‌పేట సర్కిల్ పరిధిలోని గుర్రంగూడ బాలాజీ రెసిడెన్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ వేలంలో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్న మహ్మద్ షేక్ హసీం రూ.33,116 చెల్లించి లడ్డూను సొంతం చేసుకున్నారు.
డప్పుచప్పుళ్లతో ఊరేగింపు
ఈ సందర్భంగా స్థానికులు ఆయనను ఘనంగా సన్మానించి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారంటూ లడ్డూతో పాటు ఆయన ఇంటి వరకు డప్పు చప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించారు. ఇక నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా గణేష్ లడ్డూల వేలం పాటలు హోరాహోరీగా సాగి భారీ ధరలు పలికాయి. అల్మాస్గూడ శ్రీహిల్స్ కాలనీ ఫేజ్-2లో జరిగిన వేలంలో కొండోజు కపిల్-సరిత దంపతులు పెద్ద లడ్డూను రూ.1.01 లక్షలకు దక్కించుకోగా, చిన్న లడ్డూను వెంకటేశ్వర్లు-హైమవతి దంపతులు రూ.65 వేలకు సొంతం చేసుకున్నారు.
లడ్డూ రూ.5,30,000
మరోవైపు కొత్తపేట న్యూ నాగోల్ కాలనీలో గణేష్ మహారాజ్ లడ్డూ వేలం పాటలో స్థానికుడు ఏకంగా రూ.5,30,000లకు కైవసం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే సత్యానగర్ హరిహర క్షేత్రంలో అమెరికాలో స్థిరపడిన తమ కుమార్తె అనిత, అల్లుడు గుమ్మడవెల్లి సోమేష్‌ల తరఫున పెంటయ్య అనే భక్తుడు రూ.2,17,800లకు లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూ వేలం పాట ద్వారా ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
