* గ్రీన్ చానల్ ద్వారా నిధులు ఇచ్చేందుకు సిద్ధం
* కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
* మహబూబ్నగర్ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
* ప్రొటోకాల్ రగడ.. బీజేపీ ఆందోళన
ఆకేరు న్యూస్, మహబూబ్నగర్ : యుద్ధ ప్రాతిపదికన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. సీఎం ఈరోజు సొంత జిల్లా మహబూబ్నగర్ లో పర్యటించారు. కల్వకుర్తి (Kalwakurthy) పనుల పూర్తికి డిసెంబర్ 2025 డెడ్లైన్ విధించారు. జిల్లాలో పర్యటించిన రేవంత్రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే సాగునీరు, విద్య, వైద్యం, పలు అంశాలపై చర్చించారు. ప్రతి నెల ప్రాజెక్ట్ పనులను సమీక్షిస్తానని స్పష్టం చేశారు. ఇక ప్రాజెక్ట్ పనులు ఆలస్యం కాకూడదని అన్నారు. మహబూబ్నగర్ కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కల్వకుర్తి పనులపై ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ప్రతీ నెలా ప్రాజెక్టు పనుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఈ నెల 14 లేదా 15న ఇరిగేషన్ మంత్రితో సమీక్షిస్తానని వెల్లడించారు. ఈరోజు జిల్లాలో మొత్తం 396.09 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించగా, మరో రూ.353.66 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.
కలెక్టర్కు ఎంపీ డీకే అరుణ ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు (D.K. Aruna) ఆహ్వానం అందలేదని బీజేపీ (BJP) నాయకులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు అనవసరం అని, అధికారుల తీరుపై పాలమూరు బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. సోషల్మీడియా, మీడియా ద్వారా విషయం తెలుసుకున్నానని, అభివృద్ధి పనులపై తనకు కనీస సమాచారం లేదని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. ఎన్నికలు ముగిశాయని, ఇక తిట్టుకోవడం మానేసి జిల్లా అభివృద్ధికి సమష్టిగా పనిచేయాలని సూచించారు.
———————-