* ఇంత దౌర్జన్యం చేస్తుంటే టెన్సన్ వస్తాంది..
* పోలీసులపై ఊగిపోయిన మల్లారెడ్డి
* భూ వివాదంలో హల్చల్.. అల్లుడు సహా మల్లారెడ్డి అరెస్ట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఓ భూవివాదం గొడవలో మాజీ మంత్రి మల్లారెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా జాగాలో కంచె వేస్తారూ.. ఇంత దౌర్జన్యం చేస్తుంటే టెన్సన్ వస్తాంది.. మీరు మమ్మల్ని అడ్డకుంటున్ను అంటూ మండిపడ్డారు. హైదరాబాద్ సుచిత్ర చౌరస్తా సమీపంలోని సర్వే నంబర్ 82లో భూవివాదం నెలకొంది. మాజీ మంత్రి మల్లారెడ్డి, మరో వర్గం మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భూ వివాదం విషయంలో సుమారు 15 మంది వ్యక్తులు మల్లారెడ్డితో గొడవకు దిగారు. మల్లారెడ్డికి చెందిన రెండెకరాల భూమిలోకి కాంగ్రెస్ పార్టీ విప్ లక్ష్మణ్, శ్రీనివాస్ రెడ్డి అనుచరులు అక్రమంగా చొరబడి వీరంగం సృష్టించారని మల్లారెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వెంటనే అక్కడికి చేరుకున్నారు. తన భూమిలో వంద మంది గూండాలు దౌర్జన్యంగా చొరబడి పాగా వేశారని మల్లారెడ్డి ఆరోపించారు. పోలీసు యంత్రాంగం సైతం వాళ్లవైపే మాట్లాడటం దౌర్జన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భూమి చుట్టు అక్రమంగా ఫెన్సింగ్ వేశారన్నారు. నూకు.. నూకు.. అంటూ ఫెన్సింగ్ తొలగించాలని అనుచరులకు ఆదేశించారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఇరు వర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పేట్ బషీరాబాద్ సీఎస్‌కు తరలించారు.
——————-