
* ఆపరేషన్ కగార్ పాశవిక చర్య
* అణచివేత ద్వారా మావోయిస్టులను నిర్మూలించలేరు
* అమాయక ఆదివాసీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
* మంత్రి సీతక్కపై వచ్చిన పత్రికా ప్రకటనతో మాకు సంబందం లేదు
* భారత కమ్యూనిస్ట్ పార్టీ ( మావోయిస్ట్) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్
ఆకేరున్యూస్,హనుమకొండ : జూన్ ఒకటో తేదీన తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు దామోదర్ లొంగి పోతున్నట్లు దిన పత్రికల్లో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. మీడియా చేసిన ఈ ప్రకటనల్లో ఎలాంటి వాస్తవం లేదని పోలీసులే ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేశారని పేర్కొంటూ భారత కమ్యూనిస్టు పార్టీ ( మావోయిస్ట్ ) రాష్ట్ర కమిటీ అధికార ప్రతిని ధి జగన్ పేరున ఓ లేఖ విడుదల అయింది. పోలీసులు కావాలని దుష్ప్రచారం చేశారని ఆలేఖలో పేర్కొన్నారు. దామోదర్ ఎన్ కౌంటర్ లో చనిపోయాడని ఓసారి, లొంగిపోయాడని ఓసారి ఇలా అనేక సార్లు మీడియాలో ప్రచారం చేశారని పేర్కొన్నారు. విప్లవ ప్రజలను గందరగోళం చేయడానికే ఈ ప్రచారం చేశారని పేర్కొన్నారు. 26-06-2025 వ తేదీన తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో మంత్రి సీతక్కపై వచ్చిన పత్రికా ప్రకటనకు మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాశవికంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ తెలంగాణ లోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదని, ఎన్ కౌంటర్లు ఆపాలని కేంద్రప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నదని పేర్కొన్నారు. మావోయిస్ట్ సమస్య సామాజిక , రాజకీయ సమస్య అని అణచివేతల ద్వారా మావోయిస్టు పార్టీని నిర్మూలించడం సరైనది కాదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి ప్రజలందరికీ తెలిసిందే నని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు లేకపోయినప్పటికీ పోలీసులు మాత్రం మావోయిస్ట్ పార్టీకి ఎలాంటి సహకారం అందించకూడదని ములుగు,కొత్తగూడెం భధ్రాద్రి , ఆసిఫాబాద్ జిల్లాలో అమాయక ఆదివాసీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని , తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని జగన్ లేఖలో పేర్కొన్నారు.
……………………………………………….