మాయలేడి చిత్ర బృందం
* నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల
* ట్రైలర్‌తో ఆకట్టుకున్న చిత్ర బృందం
Mayaledi| ఆకేరు న్యూస్, సినిమా: యంగ్ హీరో, నిర్మాత రాకేష్ వర్రె నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రం మాయలేడి. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మధుమిత సర్కార్ హీరోయిన్గా నటిస్తున్నారు. నవంబర్ 13న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో, నిర్మాత రాకేష్ వర్రెతో పాటు చిత్ర బృందం సినిమా విశేషాలను వెల్లడించింది.
గతంలో ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి విభిన్న కథా చిత్రాలను నిర్మించిన రాకేష్ వర్రె.. ఈసారి ప్రేమ, కుటుంబ అనుబంధాలు, సంగీతం, వినోదానికి ప్రాధాన్యతనిస్తూ మాయలేడి ని రూపొందించారు. రెండేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని రాకేష్ తెలిపారు.
మన్మథుడు’, నువ్వు నాకు నచ్చావ్ , నిన్నే పెళ్లాడతా వంటి చిత్రాల్లో కనిపించే కుటుంబ భావోద్వేగాలు, సంగీతం, వినోదాన్ని మాయలేడి లో చూపించే ప్రయత్నం చేశామని చెప్పారు. ఖుషి తరహా ప్రేమకథలను ప్రేక్షకులు మళ్లీ ఆస్వాదించేలా ఈ సినిమా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వరుసగా యాక్షన్ సినిమాలు వస్తున్న నేపథ్యంలో తమ చిత్రం ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందిస్తుందని పేర్కొన్నారు.
దర్శకుడు ప్రశంకర్తో కలిసి దాదాపు ఏడాది పాటు స్క్రిప్ట్‌పై పనిచేసినట్లు రాకేష్ వెల్లడించారు. కథలో సంగీతానికి ప్రత్యేక స్థానం ఉండటంతో విశాల్ చంద్రశేఖర్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నామని తెలిపారు. సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా సమానమైన ప్రాధాన్యత ఉంటుందని, అందుకే మధుమిత సర్కార్‌ను ఎంపిక చేసినట్లు చెప్పారు. కథపై నమ్మకంతో తన మార్కెట్ పరిధికి మించి ఖర్చు పెట్టి సినిమాను నిర్మించానని, ప్రేక్షకులు థియేటర్లలో హాయిగా ఆస్వాదించే మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను అందిస్తామని అన్నారు.
దర్శకుడు ప్రశంకర్ మాట్లాడుతూ.. ఒక రిలేషన్షిప్లో ఎదురయ్యే విభిన్న భావోద్వేగాల చుట్టూ సినిమా కథ సాగుతుందని వివరించారు. క్రిష్ అనే యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌లోని సంతోషం, కోపం వంటి భిన్నమైన భావాలను ఎలా ఎదుర్కొన్నాడనే అంశాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించామని తెలిపారు. సంగీతం, వినోదంతో పాటు చిన్న సందేశం కూడా సినిమాలో ఉంటుందని చెప్పారు.
హీరోయిన్ మధుమిత సర్కార్ మాట్లాడుతూ.. ‘మాయలేడి’ తన తొలి తెలుగు సినిమా అని తెలిపారు. తన పాత్రలో నటనకు మంచి అవకాశం ఉందని, ఇలాంటి మంచి చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. సినిమా కోసం పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపామని, ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫైట్ మాస్టర్ అంజి మాట్లాడుతూ.. సినిమాలో విభిన్నమైన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలిపారు. హీరో, హీరోయిన్ ఇద్దరూ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా సాధన చేసి అద్భుతంగా నటించారని చెప్పారు. ఆర్ట్ డైరెక్టర్ భార్గవ నౌండ్ల, నటి మధురిమ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

