*మెదక్ కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష…
ఆకేరు న్యూస్, మెదక్: కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినందుకు గాను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు తెలంగాణ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఒక భూ వివాదం కేసులో న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు ఆయనకు 6 నెలల జైలు శిక్షతో పాటు రూ. 2,000 జరిమానా విధిస్తూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఒక మహిళకు సంబంధించిన భూహక్కుల విషయంలో గతంలో వివాదం నెలకొంది. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించగా, సదరు భూ వివాదాన్ని క్షేత్రస్థాయిలో విచారించి, ఇరు పక్షాల వాదనలు విని పరిష్కరించాలని కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. ఇందుకు ఒక నిర్ణీత గడువును కూడా విధించింది. కోర్టు ఆదేశించి గడువు ముగిసినప్పటికీ, కలెక్టర్ రాహుల్ రాజ్ ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. బాధితురాలు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో, దీనిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు కోర్టు ధిక్కరణ (Contempt of Court) కింద ఈ శిక్షను ఖరారు చేసింది. ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష పడటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
—————————–
