* కలెక్టర్ దివాకర్ కృషితో సర్వత్రా ప్రశంసలు
* విజయవంతంగా అభివృద్ధి పనులు పూర్త్తి
ఆకేరు న్యూస్, మేడారం: కోట్లాది మంది భక్తుల కొంగుబంగారం, అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణలో ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్ తనదైన ముద్ర వేశారు. జాతర పనులను పర్యవేక్షించడంలో ఆయన చూపిన అంకితభావం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది జాతర కోసం ప్రభుత్వం భారీగా రూ. 251 కోట్లను కేటాయించింది. ఇందులో రూ. 150 కోట్లను మౌలిక సదుపాయాల కోసం, మిగిలిన రూ. 101 కోట్లను గద్దెల ఆధునీకరణ కోసం వెచ్చించారు. ముఖ్యంగా శతాబ్దాల చరిత్ర కలిగిన గద్దెల స్వరూపాన్ని మార్చడం, పునరుద్ధరించడం అనేది అత్యంత సున్నితమైన మరియు క్లిష్టమైన ప్రక్రియ. గిరిజన ఆచారాలు, పూజారుల మనోభావాలు దెబ్బతినకుండా కలెక్టర్ ఈ పనులను విజయవంతంగా పూర్తి చేయించారు. జాతర ప్రారంభానికి మూడు నెలల ముందు నుంచే కలెక్టర్ దివాకర్ రంగంలోకి దిగారు. గద్దెల సుందరీకరణ, రాతి స్తంభాల చెక్కడాలు, పగిడిద్దరాజు మరియు గోవిందరాజుల గద్దెల పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు.పనులు త్వరితగతిన పూర్తి కావడానికి గద్దెల ప్రాంగణంలోనే ఉండి పనులను పర్యవేక్షించడం విశేషం.గడువులోగా పనులు పూర్తి చేయడంలో ఆయన చూపిన చొరవను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అభినందించారు.మంత్రి సీతక్కతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, అటు అధికారులను, ఇటు పూజారులను సమన్వయం చేసుకుంటూ జాతర ఏర్పాట్లను కలెక్టర్ దివాకర్ అద్భుతంగా నిర్వహించారు. గతంలో జంపన్నవాగు వంతెనను 40 రోజుల్లో పూర్తి చేసిన రికార్డు ఉంటే, ఇప్పుడు గద్దెల పునరుద్ధరణ పనులను కేవలం మూడు నెలల్లో పూర్తి చేసి కలెక్టర్ దివాకర్ మరో రికార్డు సృష్టించారు.ప్రస్తుతం మేడారం గద్దెలు కొత్త శోభను సంతరించుకున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కలెక్టర్ చేస్తున్న కృషితో ఈసారి జాతర చిరస్మరణీయంగా నిలవనుంది.
…………………………………….
