* ఏపీ సీఎం చంద్రబాబు లేఖతో చిగురిస్తున్న ఆశలు
* సానుకూల దృక్పథంలో తెలంగాణ సీఎం
* సుదీర్ఘ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ విభజన అనంతరం ఏర్పడిన కొన్ని చిక్కుముడులు ఇప్పటికీ వీడలేదు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడి (Chandrababu Naidu) చొరవతో ఆ అంశాల పరిష్కారంపై కదలిక మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ఏపీ, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరి మధ్య రాజకీయంగా, వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉండడం, ఇరు రాష్ట్రాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ది కనబరుస్తుండడంతో విభజన అంశాల్లో కొన్నింటికైనా మోక్షం లభిస్తుందన్న ఆశలు చిగురిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (Andhra Pradesh Reorganisation Act) 2014 ప్రకారం హైదరాబాద్ పూర్తిగా తెలంగాణకు చెందింది. అయితే రెండు రాష్ట్రాల మధ్య చట్టంలోని షెడ్యూల్ 9 మరియు షెడ్యూల్ 10లో జాబితా చేయబడిన వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన, అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు.
ప్రధానంగా తొమ్మిది అంశాలు
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలుకు సంబంధించి పరిష్కారం కావాల్సిన సమస్యలు చాలానే ఉన్నప్పటికీ ప్రధానంగా తొమ్మిది అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దృష్టి సారించాల్సి ఉంది. షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన, ఆస్తుల పంపకాలు, ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థికపరమైన అంశాలపై చర్చ జరగాల్సి ఉంది. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, విద్యుత్ వినియోగ అంశాలు పన్ను అంశాల్లో సవరణలు, ఏపీఎస్సీఎస్సీఎల్, టీఎస్సీఎస్సీఎల్ సంస్థల్లో నగదు అంశం, వనరుల సర్దుబాటు, 7 వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి నిధుల అంశం, పన్ను రాయితీ అంశాలు కొలిక్కి రావాల్సి ఉంది. చంద్రబాబు, రేవంత్ భేటీలో వీటిపైనే ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి.
త్వరలోనే సీఎంల భేటీ
ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లోని ప్రజా భవన్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిపై స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంలో సంబంధిత అంశాలపై ముఖాముఖి చర్చించుకుందామని ప్రతిపాదించారు. ఇందుకు రేవంత్ కూడా అంగీకరించారు. దీనిపై అధికారికంగా ఈరోజు స్పందించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశానికి ముఖ్యమంత్రులతోపాటు రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున సీనియర్ మంత్రులు, సంబంధిత అంశాలకు సంబంధించిన సీనియర్ అధికారులు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
లేఖలో చంద్రబాబు ఏం పేర్కొన్నారంటే..
డియర్ శ్రీ రేవంత్ రెడ్డి గారూ..
‘‘పేరు పెట్టేందుకు వీలులేని విధంగా మీరు చేపడుతున్నకార్యక్రమాలకు నా హృదయపూర్వక అభినందనలు. మీ అంకిత భావం, నాయకత్వ పటిమ తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్న మనం ఒక చక్కటి అనుబంధంతో పనిచేయగలిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటి అభివృద్ధికి, పురోగతికి ఉపయోగపడుతుంది. మన ఉమ్మడి ఆలోచనలు, సహకార కృషి మన ఉమ్మడి లక్ష్యాల సాధనకు దోహదం చేసి ప్రజల జీవితాలు మెరుగు పడటానికి ఒక మార్గం ఏర్పరుస్తుంది.
ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికి పదేళ్లయింది. విభజన చట్టానికి సంబంధించిన అనేక అంశాలపై ఇంకా పలు రకాలైన చర్చలు జరుగుతున్నాయి. అత్యంత జాగురూకతతో ఉభయులకూ ఆమోదయోగ్యంగా వీటిని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. దీని కోసం ఈ నెల ఆరో తేదీ శనివారం మధ్యాహ్నం, మీ ప్రదేశంలో మనం కలుద్దాం. మనం ముఖాముఖీ కూర్చుని మాట్లాడుకోవడం వల్ల సున్నితమైన అంశాలకు పరిష్కారం కనుగొనడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ సమావేశంలో జరిగే చర్చల వల్ల ఉపయుక్తమైన పరిష్కారాలు వస్తాయని నేను విశ్వసిస్తున్నాను.’’ అని వెల్లడించారు.
—————————————–