* జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం వర్సెస్ బీజేపీ
* పోటీలో లేకున్నా ప్రచార జోరు
* కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటికీ నేతలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రచారంలో ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కాకుండా అనూహ్యంగా ఎంఐఎం(మజ్లిస్) కూడా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్ పార్టీకి ఎంత కీలకమో, మజ్లిస్ పార్టీకి కూడా అంతే కీలకంగా భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన మజ్లిస్ పార్టీ కేవలం అక్కడితో ఆగిపోలేదు. కాంగ్రెస్ పార్టీతో సమానంగా ప్రచార బాధ్యతలు భుజానకెత్తుకుంది. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
కాంగ్రెస్ నేతలతో పాటు..
ఇక్కడ విచిత్రం ఏమిటంటే అసదుద్దీన్ ఓవైసీతో పాటు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ అభ్యర్థికి ఓటు వేయమని, బ్యాండ్ మేళాలతో తిరిగి ప్రచారం చేయకుండా వారి స్టైల్లో వినూత్నంగా వెళ్తున్నారు. మజ్లిస్ పార్టీ తరఫున బస్తీ మీటింగ్‌లు, కమ్యూనిటీ మీటింగ్‌లు, మసీద్ కమ్యూనిటీ మీటింగ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు ఆ సమావేశాల్లో అసదుద్దీన్ ఓవైసీ, మజ్లిస్ ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొంటున్నారు. షేక్‌పేట్ డివిజన్లో ఇటీవల మంత్రుల పర్యటనలో భాగంగా మైనార్టీ ఓటర్లుకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మజ్లిస్ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశాలన్నీ విజయవంతం అవుతుండడం గమనించాల్సిన అంశం.
మైనార్టీ ఓట్లే కీలకం.. అందుకే..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్, ఎర్రగడ్డ, బోరబండ, రహమత్‌నగర్ డివిజన్లలో మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్నాయి. ఒక్క షేక్‌పేట్ డివిజన్‌లోనే 60 వేల ఓట్లు ఉండగా, మిగతా ప్రాంతాల్లో కూడా భారీగా ఉన్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లక్షా 40 వేల వరకు మైనార్టీ ఓట్లు ఉన్నట్లు అంచనా. మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్న డివిజన్లకు మజ్లిస్ ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఇన్చార్జిలుగా నియమించింది. ఇక 60 వేల ఓట్లు ఉన్న షేక్‌పేట్ డివిజన్లో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్‌ను ఇంఛార్జీగా ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. షేక్‌పేట్ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కార్వాన్ నియోజక వర్గంలో పూర్తిగా కలిసి ఉంటుంది.
ఎమ్మెల్యే కౌసర్ నాయకత్వంలో..
షేక్‌పేట్ డివిజన్లోని బస్తీలు, కాలనీలు, అలాగే హిందూ బస్తీల్లోని ప్రజలు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్‌కు పరిచయస్తులుగా ఉన్నారు. ఆయన చిన్పప్పటి నుంచి ఎక్కువుగా షేక్‌పేట డివిజన్‌లోనే పని చేశారు. దీంతో కౌసర్‌కు ప్రత్యేకంగా షేక్‌పేట డివిజన్ బాధ్యతలను అప్పగించారు. ఇక మహ్మద్ కౌసర్ ఈ బాధ్యతలు తీసుకొని మైనార్టీ ఓట్లు కనీసం 40 వేలు, మరో 30 వేలు హిందూ ఓట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఆయన ప్రతీరోజు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక షేక్‌పేట్ డివిజన్‌పై కూడా ఎంపీ అసుద్దీన్ ఓవైసీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మజ్లిస్ పార్టీ సొంత అభ్యర్థి ఉంటే ఎలా ప్రచారం జరుగుతుందో ఆ స్థాయిలో ప్రచారం సాగుతోంది.
