* బాధితుడు కోలుకునే దాకా పరిస్థితిని నిరంతరం సమీక్షించాలి
* డీఎఫ్ఓను ఆదేశించిన మంత్రి సురేఖ
ఆకేరు న్యూస్, వరంగల్: ములుగు జిల్లా తాడ్వాయి రేంజ్, గంగారం సెక్షన్ పరిధి దామరవాయి బీట్ -2లోని అటవీ ప్రాంతంలో దుండగుల దాడిలో గాయపడి, వరంగల్ ములుగు రోడ్లోని గార్డియన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వినోద్ కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శరత్ చంద్రలను మంత్రి కొండా సురేఖ శుక్రవారం పరామర్శించారు. గార్డియన్ హాస్పిటల్కు బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దుండగులతో ఘర్షణకు దారి తీసిన పరిస్థితులను డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ మంత్రి సురేఖకు వివరించారు. చికిత్స పొందుతున్న అటవీ అధికారుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వారికి భరోసానిచ్చారు. వారికి జరిపిన పరీక్షలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యాధికారులతో చర్చించారు. మెరుగైన చికిత్సను అందించాలని వారికి సూచించారు. వారు పూర్తిగా కోలుకునే దాకా పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని డిఎఫ్ఓను మంత్రి సురేఖ ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, అటవీ సంపద పరిరక్షణే ధ్యేయంగా సైనికుల్లా పోరాడుతున్న అటవీ అధికారులు, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసేవారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. అడవుల పరిరక్షణే ధ్యేయంగా అహరహం శ్రమిస్తున్న అటవీ సిబ్బందిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. అటవీ అధికారులపై జరుగుతున్న దాడులు, వారు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ దిశగా చేపట్టాల్సిన సంస్కరణల పై సీఎం రేవంత్ రెడ్డి, అటవీశాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తానని మంత్రి తెలిపారు. అటవీ అధికారుల పై దాడికి తెగబడిన వారి పౖ హత్యాయత్నం కేసు నమోదు చేసి, కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు చేపడతామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.
……………………………..