*అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన…
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
తెలంగాణలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్లు మరియు సంక్షేమ పథకాలపై రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నొత్తరాల సమయంలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. నిజమైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందులో డెస్క్ మరియు ఫీల్డ్ జర్నలిస్టులను వేరు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.
అక్రిడిటేషన్ల జారీ కోసం గతంలో ప్రభుత్వం జారీ చేసిన 252 జీవోపై జర్నలిస్టు సంఘాల నుంచి వచ్చిన విన్నపాలను సానుకూలంగా పరిశీలించామని మంత్రి తెలిపారు. జర్నలిస్టుల ప్రయోజనాల దృష్ట్యా ఇప్పటికే ఆ జీవోలో అవసరమైన సవరణలు చేశామని పేర్కొన్నారు.
అక్రిడిటేషన్ల విషయంలో కొందరు అనవసరమైన అపోహలు సృష్టిస్తున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని సవరణలు చేయడానికి లేదా కొత్త సర్క్యులర్లు జారీ చేయడానికి ప్రభుత్వం ఎటువంటి భేషజాలకు పోదని మంత్రి భరోసా ఇచ్చారు.
డిజిటల్ మీడియా రంగం పెరుగుతున్న నేపథ్యంలో, రాబోయే రెండు మూడు నెలల్లో సరికొత్త ‘డిజిటల్ మీడియా పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ పాలసీకి సంబంధించిన ముసాయిదా ఇప్పటికే సిద్ధమైందని, త్వరలోనే దీనికి తుది రూపం ఇస్తామని చెప్పారు. జర్నలిస్టుల చిరకాల స్వప్నమైన ఇళ్ల స్థలాల పంపిణీపై కూడా ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉందని, గతంలో ఎదురైన న్యాయపరమైన అడ్డంకులు మళ్లీ రాకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని వివరించారు.
ముఖ్యంగా, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీపై ఇటీవల మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని మంత్రి గుర్తు చేశారు. అతి త్వరలోనే జర్నలిస్టులకు ఈ విషయంలో ఒక గొప్ప తీపి కబురు అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ఉద్యోగ భద్రత మరియు వారి సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయబోదని, పాత్రికేయుల సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పునరుద్ఘాటించారు.
