* ఆలయం బయట కూర్చుని నిరసన
* బల్కంపేట ఎల్లమ్మ కల్యాణంలో ప్రొటోకాల్ రగడ
* కలెక్టర్ అనుదీప్‌పై ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ కల్యాణంలో ప్రొటోకాల్ వివాదం తీవ్ర రచ్చకు దారితీసింది. కనీస ప్రోటోకాల్ పాటించలేదని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆలయం బయటే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా వచ్చారు. కొద్ది సేపటికి కొండా సురేఖ వెళ్లారు.
ప్రొటోకాల్ ప్రకారం పంపకుండా సామాన్యులు వెళ్లే లైనులోనే పంపడంతో తొక్కిసలాట జరిగింది. మంత్రి వెంటే మేయర్ విజయలక్ష్మి కూడా ఉన్నారు. తొక్కిసలాటలో మేయర్ కు గాయాలు అయ్యాయి. దీంతో కనీ స ప్రొటోకాల్ పాటించకపోవడంపై పొన్నం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపంతో గుడిబయటే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
ఏర్పాట్లు బాగున్నాయి : కిషన్ రెడ్డి
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం అంగరంగ వైభవంగా కొనసాగింది. మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఏర్పాట్లు బాగున్నాయని నిర్వాహకులను ప్రశంసించారు. ఆలయానికి కేంద్రం కేటాయించిన నిధులను త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితర కాంగ్రెస్ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు.
————————