Naini Rajender Development Works
* 61వ డివిజన్లో రూ. కోటి పనులకు శంకుస్థాపన..
ఆకేరు న్యూస్, హనుమకొండ :
కాజీపేట పరిధిలోని 61వ డివిజన్ వెంకటాద్రి నగర్, ప్రశాంత్ నగర్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ. కోటి వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కాలనీవాసుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి, భూముల పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు.
* వర్షాకాలం నాటికి 90% పనులు పూర్తి..
“కేవలం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి వదిలేయడం మా సంస్కృతి కాదు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. రాబోయే వర్షాకాలం నాటికి డివిజన్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో 90 శాతం పూర్తి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. ప్రతి పనికి ఒక టైమ్ లిమిట్ (కాలపరిమితి) నిర్ణయించి, క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నాం” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
* కాజీపేట అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత..
గత ప్రభుత్వాల మాదిరిగా తాము కేవలం హామీలకే పరిమితం కావడం లేదని, పనులు చేసి చూపిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాజీపేట రైల్వే ఓవర్‌బ్రిడ్జి (ROB) పనులను వేగవంతం చేశామని గుర్తుచేశారు.
త్వరలోనే కాజీపేటలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నట్లు వెల్లడించారు.కాజీపేట ఆధునిక బస్‌స్టాండ్ నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని తెలిపారు.
* ప్రభుత్వ భూముల పరిరక్షణపై రాజీ లేదు..
నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఎమ్మెల్యే నాయిని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. “గడిచిన రెండున్నర సంవత్సరాలుగా నగరంలో ఎటువంటి భూ కబ్జాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ భూములను కాపాడేందుకు అన్ని ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నాం.
ఇటీవల హంటర్ రోడ్లో కొందరు వ్యక్తులు చేసిన భూ ఆక్రమణ ఉదాంతాన్ని ప్రజలందరూ గమనించారు” అని అన్నారు.
“వైఎస్సార్ నగర్ భూముల అంశంపై జిల్లా యంత్రాంగం ప్రస్తుతం సమగ్ర విచారణ జరుపుతోంది. ప్రైవేట్ భూములకు సంబంధించి కోర్టు తీర్పే అంతిమం, న్యాయపరమైన నిర్ణయాలను ప్రభుత్వం గౌరవిస్తుంది. ఒకవేళ అది ప్రభుత్వ స్థలమని తేలితే.. ఒక్క గజం కూడా ఆక్రమణకు గురికాకుండా కాపాడుతాం. అవసరమైతే ఆ స్థలంలో బస్‌స్టాండ్, పోలీస్ స్టేషన్ లేదా ఇతర ప్రజాప్రయోజన నిర్మాణాలను ఏర్పాటు చేస్తాం.”
అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు..
* విపక్షాల విమర్శలపై ఘాటు స్పందన..
అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే తప్పుపట్టారు. గతంలో జరిగిన భూ ఆక్రమణలపై నోరు మెదపని ప్రతిపక్షాలు, ఇప్పుడు రాజకీయ విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు.
“గత ప్రభుత్వ హయాంలో పాలకులు తమ సొంత పార్టీ కార్యాలయాల కోసం విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినప్పుడు ఈ బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు?” అని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని ఆయన స్పష్టం చేశారు.
