Padi Kaushik Reddy Memorandum
* ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వినతిపత్రం
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
* దళిత బంధు రెండో విడత నిధుల విడుదల
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ద్వారా వేలాది కుటుంబాలు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా నిలదొక్కుకున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండో విడత నిధులను నిలిపివేయడంతో అర్హులైన లబ్ధిదారులు తీవ్ర నిరాశకు గురయ్యారని వెంటనే రెండో విడత నిధులను విడుదల చేసి లబ్ధిదారులకు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
* రైతాంగానికి సాగునీటి సరఫరా
సాగునీరు లేక ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంపుల ద్వారా అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, నందిమేడారం, మిడ్ మానేరు మీదుగా తక్షణమే నీటిని విడుదల చేయాలని కోరారు. అంతేకాకుండా, కాల్వలకు అవసరమైన మరమ్మతులు చేపట్టి చివరి ఆయకట్టు రైతులకు కూడా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
* గుంతలమయమైన రహదారుల మరమ్మతులు
ఇసుక వాహనాల నిరంతర రాకపోకల వల్ల హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాల్లోని ప్రధాన రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. దీనివల్ల విద్యార్థులు, రైతులు, సామాన్య ప్రజలు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని, తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేపట్టి సురక్షితమైన ప్రయాణ సదుపాయం కల్పించాలని కలెక్టర్‌ను కోరారు.
ప్రజా సమస్యల పరిష్కారమే తన నియోజకవర్గ ప్రధాన ధ్యేయమని, హుజూరాబాద్ ప్రజల హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తూ పోరాటం కొనసాగిస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
