* వరంగల్ ట్రాఫిక్ ఏసీపి సత్యనారాయణ
ఆకేరు న్యూస్, హనుమకొండ : ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసిన వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్ పై క్రిమినల్ చర్యలు తీసుకోబడుతాయని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులు బుధవారం సి.పి.ఓ జంక్షన్ వద్ద అధిక శబ్ధం చేసే ద్విచక్రవాహన సైలెన్సర్లను రోడ్ రోలర్ తో ధ్వంసం చేసారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా ట్రైసిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనీఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేసిన ద్విచక్రవాహనాలను గుర్తించి వాటి నుండి మార్పు చేసిన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. ట్రాఫిక్ పోలీసులు తొలగించిన సైలెన్సర్లను మరోమారు వినియోగించకుండా రోడ్ రోలర్ సాయంతో 261కు పైగా సైలెన్సర్లను ద్వంసం చేసారు. ధ్వంసం చేసిన సైలెన్సర్లలో హనుమకొండకు చెందినవి 73 కాగా కాజీపేట 88, వరంగల్ 100 ఉన్నాయి.
ఈ సందర్బంగా ట్రాఫిక్ ఏసీపి మాట్లాడుతూ సీపి అదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమని, శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజాఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికంగా శబ్దం చేసే ద్విచక్రవాహనా లపై ప్రత్యేక దృష్టి సారించి తనీఖీలు చేపట్టడం జరిగిందన్నారు. కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు, ఎవరైన వాహనదారుడు సైలెన్సర్ మార్పు చేస్తే వారిపై పోలీసులు క్రిమినల్ చర్యలతో పాటు అట్టి వాహనదారులకు ఆర్టీఐ ద్వారా మూడు నెలలు లైసెన్సు రద్దు చేయడం మరియు అట్టి వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందన్నారు .. మెకానిక్ లు కూడా కూడా ద్విచక్రవాహనాలకు సైలెన్సర్ల మార్పుకు ప్రోత్సహించవద్దని, సైలెన్సర్ల మార్పుకు సహకరిస్తే క్రిమినల్ చర్యలు తీసుకోబడుతాయని ఏసీపి అన్నారు. ఈ కార్యక్రమములో టైనీ ఐపిఎస్ శుభం నాగ్, హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్లు శ్రీధర్, షుకూర్, నాగబాబుతో పాటు ట్రాఫిక్ ఎస్.ఐలు పూర్ణ చంద్ర రెడ్డి, యుగంధర్ ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
——————–