ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అనుకోని ఘటనతో ఆ తల్లి సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురైంది. అమ్మ మనసును గాయపరిచేలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్లను తట్టుకోలేకపోయింది. తీవ్ర మనోవేధనకు గురైంది. నవ మాసాలు మోసి కని పెంచిన బిడ్డను ఎంతో అపురూపంగా చూసుకుంటున్న నాపై ఇలాంటి నిందలు ఎలా వేస్తున్నారని తీవ్ర మనస్థాపానికి గురై కఠిన నిర్ణయం తీసుకుంది.
అసలు ఏం జరిగిందంటే..
తమిళనాడు అవడిలోని వీజీఎన్ స్టాఫర్డ్ అపార్ట్మెంట్ భవనం నాలుగో అంతస్తులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రమ్య నివశిస్తోంది. గత నెల 28న తన చిన్నారిని చంకలో ఉంచుకొని.. ఇల్లు ఊడ్చే కర్ర తేవడం కోసం బాల్కనీలోకి వెళ్లింది. ఈ సమయంలో అనుకోకుండా ఆ బాబు తల్లి చేతుల్లో నుంచి జారి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ మీదున్న రేకులపై పడ్డాడు. దీంతో ఆమె పెద్దగా కేకలు వేయగా అపార్ట్మెంట్ వాసులు బయటకు వచ్చి చూసేసరికి సన్షేడ్పై బాబు వేలాడుతూ కనిపించాడు.. కొందరు బెడ్ షీట్లు కింద పట్టుకోగా.. .కిటికీలో నుంచి బయకు వచ్చి ఓ వ్యక్తి ఆ చిన్నారిని చాకచక్యంగా అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సోషల్ మీడియాలో తీవ్రమైన కామెంట్లు
చిన్నారిని రక్షిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు నెటిజన్లు చిన్నారి తల్లిపై విపరీతమైన ట్రోల్స్ చేయడమే కాదు.. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు, స్నేహితులు సైతం రమ్యను కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. ‘బిడ్డ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉన్నదానికి ఎందుకు కనాలి’, ‘నువ్వు అసలు కన్న తల్లివేనా? పిల్లలను చూసుకోవడం కూడా చేతకాదా?’ అంటూ కామెంట్లు చేయడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. తీవ్రమైన మానసిక ఒత్లిడికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం కుమారుడితో కలిసి కోయంబత్తూరు సమీంలోని కరమండైలో తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఆదివారం ఇంట్లో ఆపస్మారక స్థితిలో ఉన్న రమ్యను చూసిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె మరణంపై నటుడు ప్రశాంత్ రంగస్వామి, సింగర్ చిన్మయి శ్రీపాద స్పందిస్తూ.. ఏ తల్లి తన బిడ్డను నిర్లక్ష్యంగా చూడదని.. మీ ట్రోల్స్ వల్ల ఓ తల్లి ప్రాణాలు పోయాయని విమర్శించారు.
———————–