MP KADIYAM KAVYA Station Ghanpur
* ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి సమాజం భాగస్వామ్యం కావాలి
* విద్యారంగంలో స్టేషన్ ఘన్ పూర్ ఆదర్శంగా నిలవాలి
– వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
బడి సమాజాన్ని.. భవిష్యత్ తరాలను తయారు చేస్తుందని అందుకే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో సమాజం భాగస్వామ్యం కావాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు.
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా స్టేషన్ ఘన్ పూర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి గ్రామ సర్పంచులు, కౌన్సిలర్ల విద్యా అవగాహన సదస్సుకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం సమాజం చేతుల్లోనే ఉందని, ప్రజాప్రతినిధులు గుడిని ఎంత శ్రద్ధగా చూసుకుంటారో బడిని కూడా అంతే బాధ్యతగా చూసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఎన్నో ఉన్నత స్థానాలకు చేరుకున్న వారిలో ప్రస్తుతం సర్పంచులు, కౌన్సిలర్లు కూడా ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ బడులలో మట్టిలో మాణిక్యాలను తీర్చిదిద్దుతున్నాయని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచే స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు కూడా వస్తున్నారని తెలిపారు. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 550కు పైగా మార్కులు సాధించిన 120 మంది విద్యార్థులను సన్మానించినట్లు తెలిపారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత సమాజంపై ఉందని, ముఖ్యంగా పేద విద్యార్థులను గుర్తించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సర్పంచులు, కౌన్సిలర్లు ముందుండాలని కోరారు. పాఠశాలలకు అవసరమైన వసతులు కల్పించేందుకు అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రభుత్వ బడులపై తల్లిదండ్రుల్లో మరింత నమ్మకం పెంచి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు.
“బడి సమాజాన్ని తయారు చేస్తుంది.. భవిష్యత్ తరాలను తీర్చిదిద్దుతుంది” అని పేర్కొన్న ఎంపీ, ఉపాధ్యాయులు పిల్లలను సొంత పిల్లల్లా చూసుకుంటూ వారి ప్రతిభను గుర్తించి అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థుల విద్యా ప్రగతిపై నిరంతర మానిటరింగ్ నిర్వహించాలని తెలిపారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చెప్పినట్లుగా విద్యనే చీకటి నుంచి వెలుగులోకి తీసుకువెళ్తుందని తెలిపారు. బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇంట్లో ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందని, మహిళల విద్యపైనే దేశ ప్రగతి ఆధారపడి ఉంటుందని చెప్పారు. ప్రజాప్రతినిధులు పాఠశాలలను సందర్శించి విద్యార్థులను పలకరించాలని, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కొన్నిచోట్ల పాఠశాల సమయం ముగిసిన తర్వాత స్కూల్ ప్రాంగణాలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
మాదకద్రవ్యాలు విద్యార్థులకు అందుబాటులోకి రావడం ఆందోళనకరమని,ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండి విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11 వేల మంది ఉపాధ్యాయులను భర్తీ చేసినట్లు తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభిస్తున్నామని, పాఠశాలలో పేరెంట్స్–టీచర్స్ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ విద్యార్థుల ప్రగతిని సమీక్షించాలని సూచించారు.
రానున్న రోజుల్లో స్టేషన్ ఘన్ పూర్ విద్యారంగంలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. సమ్మర్ సీజన్లో బాల్య వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి ఘటనలను అడ్డుకుని అవసరమైతే హెల్ప్‌లైన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వినయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, వైస్ చైర్మన్ ఐలయ్య, తాసిల్దార్ స్వప్న, ఎంఈఓ కొమురయ్య, హెచ్ఎం సంపత్, నియోజకవర్గ ఎంఈఓలు, కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు పాల్గొన్నారు.
