గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క
* రూ.3.19 కోట్లతో విద్యుత్ ఉపకేంద్రం
* నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యం : మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు : వ్యవసాయ, గృహ అవసరాలకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క (Minister Seethakka) అన్నారు. మంగళవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో రూ.3.19 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ (Chalwaai Substation) ఉపకేంద్రానికి మంత్రి సీతక్క భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.
* పెరుగుతున్న విద్యుత్ అవసరాలు..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో చల్వాయి పరిసర గ్రామాలకు గోవిందరావుపేట విద్యుత్ ఉపకేంద్రం (Chalwaai Substation) నుంచి విద్యుత్ సరఫరా జరిగేదని మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని చల్వాయిలో నూతన ఉపకేంద్రం నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ ఉపకేంద్రం అందుబాటులోకి వస్తే చల్వాయి, మాచాపూర్, బుస్సాపూర్ గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందుతుందన్నారు.
రైతులు, గృహ వినియోగదారుల విద్యుత్ అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు. తక్కువ వోల్టేజీ సమస్యలు తలెత్తకుండా విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సహకారంతో ములుగు ప్రాంతంలోని పలు మండలాల్లో ఇప్పటివరకు 14 విద్యుత్ ఉపకేంద్రాలను మంజూరు చేయించుకున్నట్లు తెలిపారు. ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
నూతన ఉపకేంద్ర నిర్మాణ పనులు వేగంగా, నాణ్యతతో పూర్తయ్యేలా చల్వాయి, మాచాపూర్, బుస్సాపూర్ గ్రామాల సర్పంచులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. రామప్ప, లక్నవరం జలవనరుల అనుసంధానంతో భవిష్యత్తులో సాగునీటి కోసం మోటార్ల వినియోగం పెరిగే అవకాశాలున్నాయని, అందుకు అనుగుణంగా విద్యుత్ సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్లు, కిందికి వేలాడుతున్న తీగలు, ఇతర విద్యుత్ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
* 1,550 మంది వినియోగదారులకు ప్రయోజనం..
రూ.3.19 కోట్ల అంచనా వ్యయంతో 5 ఎంవీఏ సామర్థ్యంతో నిర్మించనున్న ఈ విద్యుత్ ఉపకేంద్రం ద్వారా మూడు గ్రామాలకు చెందిన 580 మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు, 970 మంది ఇతర వినియోగదారులు కలిపి మొత్తం 1,550 మందికి ప్రయోజనం చేకూరనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 7.8 కిలోమీటర్ల మేర 33 కేవీ విద్యుత్ లైన్, 10.40 కిలోమీటర్ల మేర 11 కేవీ విద్యుత్ లైన్తో పాటు నాలుగు విద్యుత్ ఫీడర్లను ఏర్పాటు చేయనున్నారు.
నూతన ఉపకేంద్రం అందుబాటులోకి వస్తే గోవిందరావుపేట విద్యుత్ ఉపకేంద్రంపై ప్రస్తుతం ఉన్న భారం తగ్గడంతో పాటు చల్వాయి 11 కేవీ ఫీడర్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడనుందని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ భిక్షపతి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

