నేడు ఉత్కంఠకు తెర
డీసీపీ సందర్శన
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
హోరెత్తిన ప్రచారాలు, మనీ, మద్యం పంపిణీతో నువ్వా.. నేనా అనే రీతిన సాగిన మున్సిపల్ ఎన్నికల పోరులో అమీ తుమి తేలే ఫలితాల ఉత్కంఠకు నేడు తెరపడనుంది.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మునిసిపాలిటీ పరిధిలోని 18 వార్డులకు అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష టిఆర్ఎస్, బిజెపిలతో పాటు డి.ఎస్.పి, బిఎస్ పి, జనసేన పార్టీలతో పాటు స్వతంత్రులు దాదాపు 82 మంది అభ్యర్థులు మున్సిపల్ బరిలో నిలిచారు.
” మనీ, మద్యం పంపిణీ ఫలితం ఇచ్చేనా ?
బుధవారం జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీతోపాటు అభ్యర్థులందరూ డబ్బు, మద్యం, మాంసం, శీతల పానీయాలు విపరీతంగా పంచారు. ఓటుకు 1000 నుండి మొదలు 5000 వరకు పంపిణీ చేసినట్లు ప్రచారం. చీరలు, వెండి నాణాలు కూడా పంపిణీ చేశారు. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తాం, మీ సమస్యలు పరిష్కరిస్తామని చేసే ప్రచారం కన్నా ఏరులై పారించిన మనీ, మద్యం ఫలితాన్నిచ్చేనా.
” కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన డిసిపి”
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాన్ని డిసిపి రాజమహేంద్ర నాయక్ గురువారం పరిశీలించారు.18 వార్డులలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట స్థానిక సీఐ వేణు ఎస్సైలు వినయ్ కుమార్, రాజేష్ ఉన్నారు.
” ర్యాలీలు నిషేధం
ఫలితాలు వెలువడిన తర్వాత గెలుపొందిన అభ్యర్థులు, వారి అభిమానులతో నిర్వహించే ర్యాలీలు నిషేధమని సిఐ వేణు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బాణాసంచా పేల్చడం, ర్యాలీలు నిషేధమన్నారు. నిబంధనలో ఉల్లంఘిస్తే చర్యలు తప్పు అని హెచ్చరించారు.
” నేడే ఉత్కంఠకు తెర”
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పడిన 82 మంది అభ్యర్థుల్లో 18 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. నువ్వా నేనా అనే తీరున సాగిన ప్రచారం, పోలింగ్ సరళి అభ్యర్థులతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డుల ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. నేడు వెలుపడే ఫలితాలతో ఉత్కంఠకు తెరపడనుంది.
