*పంటలు ఎండిపోతున్నాయంటూ రైతన్న ఆవేదన
* సాగునీరు ఇచ్చి ఆదుకోవాలని ఈఈకి విన్నపం
ఆకేరు న్యూస్, కమలాపూర్:
పంటలు చేతికి రావడానికి సరిపడా నీళ్లు ఇవ్వాలంటూ హుజురాబాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి మొరపెట్టుకున్నారు మండల రైతులు. కాకతీయ కాలువ కింద సాగు చేస్తున్న వందలాది ఎకరాలకు సరిపడా సాగునీరు లేక ఎండిపోయే స్థితికి చేరుకున్నాయని మండలంలోని కమలాపూర్, గూడూర్, శంభునిపల్లి,కానిపర్తి సహా పలు గ్రామాల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి, మొక్కజొన్న వంటి పంటలు పండాలంటే కనీసం 120 రోజుల సమయం పడుతుంది. కానీ 80 రోజులు మాత్రమే నీరు అందడం వల్ల పంటలు పొట్ట దశలో ఎండిపోయే ప్రమాదం ఉందనీ రైతులు పేర్కొన్నారు. జనవరి 1 నుండి మార్చి 26 వరకు కేవలం 80 రోజులు మాత్రమే వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేశారని, మొక్కజొన్న పంటలు పూర్తిస్థాయిలో చేతికి రావడానికి కనీసం 120 రోజుల కాలపరిమితి అవసరమని, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో పంటలను కాపాడుకోవడానికి ఏప్రిల్ 15 వరకు నీటిని విడుదల చేయాలంటూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి విన్నవించారు. పెట్టుబడులు పెట్టి, కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు ఇప్పుడు కళ్లముందే ఎండిపోతుంటే చూడలేకపోతున్నాం. దయచేసి అధికారులు స్పందించి, ఏప్రిల్ 15వ తేదీ వరకు కాలువ నీటిని వారబందీ పద్ధతిలో పొడిగించి రైతులను ఆదుకోవాలని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
