Narsampet bandh success
ఆకేరు న్యూస్, వరంగల్:
తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి వేళ తొలగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నర్సంపేట పట్టణ బంద్ బుధవారం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. విగ్రహం తొలగింపు వార్త తెలియడంతో నిరసన తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు పట్టణంలో ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
ఈ బంద్‌కు స్థానిక వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణదారులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. ప్రధాన వీధుల్లోని షాపులు, వ్యాపార సముదాయాలన్నీ మూసివేసి నిరసనలో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించడం ప్రజల, ఉద్యమకారుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే విగ్రహాన్ని తొలగించారని ఆరోపించారు. వెంటనే అదే స్థలంలో విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని సమీక్షించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
