* బోనాల పండుగ వేళ – జాతీయ జెండా ఆవిష్కరణ
* ఆ పక్కనే ఉన్న గుడి మీద ఆర్యసమాజ్ జెండా
* ఓరుగల్లు లో అరుదైన సంప్రదాయం
* నాడు పండుగలు కూడా పోరాట రూపాలే..
* నిజాం పాలకులపై ప్రజల ధిక్కార స్వరం
* రక్తపు టేరులు ఒకచోట – రక్తపు చుక్క కానరాదు మరో చోట
* వరంగల్ బీరన్న బోనాల పండుగ వేడుకల్లో వైవిధ్యం
( చిలుముల్ల సుధాకర్ )
అణచివేతను ఎదిరించేందుకు అందుబాటులో ఉన్న ఆయుధాలే కాదు.. పండుగలను కూడాప్రజలు పోరాట ఆయుధాలు గా వాడుకుంటారు.. రజాకార్ మూకలను తరిమికొట్టేందుకు పంట
చేలకు నష్టం చేసే పక్షులను తరిమికొట్టేందుకు వాడే ‘వడిసెల’ కూడా ఆనాడు నిజాం వ్యతిరేకపోరాటంలో పదునైన ఆయుధంగా మారింది.. అదే విదంగా ప్రజలు భక్తి ప్రపత్తులతో ఉత్సాహంగా జరుపుకునే వినాయక చవితి, బోనాల పండుగలను కూడా పోరాట రూపాలుగామార్చుకున్నారు.. తమ సంస్కృతి సంప్రదాయాలను కాలరాచే మూకలకు ఎదురొడ్డి ఎందరో
వీరులు నేల కొరిగారు.. వరంగల్ నగరంలోని బోనాల పండుగ ఒక పోరాట వారసత్వంగామారింది.. బహుశా దేశంలో ఎక్కడా లేని అరుదైన దృశ్యం ప్రతి ఏటా బీరన్న బోనాల పండుగ సందర్బంగా ఆవిష్కృతమవుతుంది.. ఆగష్టు 15, జనవరి 26, జూన్ 2 లాంటి అధికారిక దినాల్లోనేకాదు… ఒకే ఆవరణలో ఉన్న బీరన్న ఆలయాల్లో విభిన్న సంప్రదాయంలో బోనాల పండుగ జరుగుతుంది. వరంగల్ కురుమలు, యాదవులు కోలాహలంగా జరుపుకునే బీరన్న బోనాల పండుగసందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ పక్కనే ఉన్న ఆలయంలో ఆర్యసమాజ్ జెండాను ఆవిష్కరిస్తారు..
ఇదీ స్థల పురాణం ..
కురుమ గొల్లల ఆరాధ్య దైవం బీరన్న, శివుడి ప్రతిరూపంగా బీరన్నను కొలుస్తారు… కరువుకాటకాలతో పాటు అనారోగ్యంతో జీవాలు ( గొర్రెలు – మేకలు) వందలాదిగా నెలకొరిగ్గాయి.. ఎంతో మంది మూలికావైద్యుల చికిత్స వల్ల కూడా నయం కాలేదు.. దీంతో కురుమ- గొల్ల పెద్దలుబీరన్నను కొలవడంతో పరిస్థితి మారి పోయింది.. కురుమ గొల్లల ఇళ్ళల్లో తిరిగి జీవాల
కలకలాడాయి.. అందుకే ప్రతి ఏటా తొలి ఏకాదశి రోజున బీరన్నకు బోనమెత్తుతారు.. తమ మొక్కులు తీర్చుకుంటారు..ఎంతో వైభవంగా జరిగే ఈ పండుగకు కేవలం కురుమ – గొల్లలే కాదు పెద్ద సంఖ్యలో అన్నివర్గాల ప్రజలు హాజరవుతారు.. బీరన్నను దర్శించుకుంటారు.. మొక్కులు తీర్చుకుంటారు..
బీరన్న గుడి మీద జాతీయ జెండా రెపరెపలు
1947 ఆగష్టు 15 న బ్రిటీష్ పాలకుల నుంచి స్వాతంత్య్రం సిద్దించింది. దేశ ప్రజలంతా ఊపిరి పీల్చుకుని సంబరాల్లో మునిగి తేలారు. హైదరాబాద్ సంస్థాన ప్రజలు మాత్రం ఇందుక భిన్నంగా నిజాం పాలకుల చేతిలో బందీలుగానే ఉన్నారు. ప్రజల చేతిలో జాతీయ జెండా కనిపిస్తే చాలు ప్రాణాలు పోవడమే, జైలు పాలవడమో జరిగేది. ఇలాంటి నిర్భంద పరిస్థితుల్లోనూ ప్రజలు జాతీయ జెండా ఆవిష్కరించేందుకు వెనుకాడేవారు కాదు.. ఇదే విదంగా పండుగలను సైతం జాతీయ జెండా ఆవిష్కరణకు ఉపయోగించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వరంగల్‌లో బోనాల పండుగ వేళ జాతీయ జెండాను నేటికి ఆవిష్కరిస్తారు.. నిజాం ఏలుబడిలో కూడా బీరన్న బోనాల పండుగ కొంత కాలం ఏ ఆటంకం లేకుండాకొనసాగింది.. వరంగల్ ఉర్సు గుట్ట సమీపంలోని బీరన్న గుడి ప్రాంతంలో బోనాల పండుగజరిగేది.. రజాకార్ మూకలు రెచ్చి పోయి హిందువుల పండుగలను అడ్డుకునేవారని తమ పెద్దలు చెప్పారని ఉర్సు , కరీమాబాద్ ప్రజలు అంటారు. వినాయక చవితి, బోనాల పండుగల సంధర్బంగా దాడులు చేసేవారు.. వీరి ఆగడాలను ఎదిరించిన యువకులు రజాకార్ల చేతుల్లో దారుణంగా హత్యగావింప బడ్డారని చెబుతారు. . దీంతో ఆ రోజుల్లో పండుగలు జరుపుకోవాలంటే ..ప్రాణాలు వదులుకోవాల్సి వచ్చేదంటారు. బోనాల పండుగ రోజున జాతీయ జెండా ఎగుర వేయడంతో పాటు జాతీయ గీతాలాపన కూడా చేస్తారు.
* రంగంలోకి దిగిన ఇటికాల మధుసూదన్ రావు
ఆర్యసమాజ్, ఇతరపోరాట యోధులు పండుగలు జరిపి తీరేందుకు నిశ్చయించుకునే వారు.. ఆర్యసమాజ్ నేత ఇటికాల మధుసూదన్ రావు ఆధ్వర్యంలో యువకులు దేహదారుఢ్య శిక్షణ తోపాటు, ఆయుధాలుఉపయోగించే తర్ఫీదు పొందారు.. ఆర్యసమాజ్, ఆంధ్ర మహాసభ, కాంగ్రెస్ నాయకులపర్యవేక్షణలో సాయుధ యువకుల సంరక్షణలో బోనాల ఊరేగింపు జరిగేది. ఒక రోజు వరంగల్ రైల్వేగేట్ ప్రాంతం నుంచి బయలు దేరిన బోనాల ఊరేగింపుపై రజాకార్ల దాడి జరిగింది.. కత్తులు, బల్లెంలు, తుపాకులు లాంటి ఆయుధాలతో ఆకస్మికంగా దాడి చేయడంతో రక్షణగా నిలిచినయువకులు మృతి చెందారు.. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. ఆర్యసమాజ్ ఇతరనాయకులు పట్టుదలతో బోనాల పండుగ ఊరేగింపును కొనసాగించారు. ముఖ్యంగా నాటిఆర్యసమాజ్ నాయకుడు ఇటికాల మధుసూదన్‌రావు ( రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు ) తో పాటు స్థానిక నేతల అధ్వర్యంలోజాతీయ జెండాను బోనాల తోపాటు తీసుకెళ్ళి ఆవిష్కరించారని స్థానికులు చెబుతున్నారు…
బోనాల పండుగ జరిగే రెండు ప్రదేశాల్లో ఒక చోట జాతీయ జెండా, మరో చోట ఓం జెండాను ఆవిష్కరిస్తారు.. ప్రతి ఏడాది ఇదే విదంగా కొనసాగుతుంది.. ఉదయం పదకొండుగంటల సమయంలో జాతీయ జెండాతో పాటు పట్టు వస్త్రాలను కురుమ సంఘం భవన్ నుంచిఆలయ కమిటీ అధ్యక్షడు చేత బూని ఆలయం చేరుకుంటారు. జాతీయ జెండాను ఆలయంలో
ఆవిష్కరించిన తర్వాత బీరన్న బోనాలు చేసుకునేందుకు అనుమతి ప్రకటన చేస్తారు.. ఈసందర్భంగా ఆలయ సమీపంలో కురుము- గొల్ల పెద్దలతో పాటు ఉత్సవ కమిటి, ఇతర పెద్దలు కూడా ఈ వేడుకకు హాజరవుతారు.. ఇదే పద్దతిలో ఉర్సు కురుమ పెద్దలు ఆర్య సమాజ్ జెండాను చేత బూని ఉదయం 7 గంటలకే ఆలయ ప్రవేశం చేస్తారు.. జెండాను ఆలయంలోఆవిష్కరిస్తారు.. ఢిల్లం-బల్లెం శబ్దాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తుతుంది.. ఏడాది పొడవునా జాతీయ జెండా, ఆర్యసమాజ్ జెండా ఆలయాలమీద రెపరెపలాడుతాయి.. మరుసటి ఏడాది బోనాల పండుగకు ఒక రోజు ముందు జెండాలను దింపి తిరిగి పండుగ రోజు జెండాలను ఆవిష్కరిస్తారు .
*ఒక చోట రక్తపు టేరులు- మరో చోట కూరగాయలు
బీరన్న బోనాల్లో మరో ప్రత్యేకత ఉంది.. కరీమాబాద్ ప్రాంత కురుమ- గొల్లలు చేసే బోనాల పండుగలో పెద్ద ఎత్తున జంతు బలి జరుగుతుంది. గావు పడుతారు. గావు అంటే పూజారి తన
నోటితో గొర్రెను కొరికి చంపుతారు.. బోనం ఎత్తిన వారు సైతం కోళ్ళు, గొర్రెలు, మేకలను బలిఇచ్చి పండుగ చేసుకుంటారు.. కాగా ఉర్సు ప్రాంతానికి చెందిన కురుమలు -గొల్లలు దీనికి భిన్నంగా బోనాల వేడుక నిర్వహిస్తారు.. ఇక్కడ జాతీయ జెండాకు బదులు ఆర్య సమాజ్ జెండాఆవిష్కరిస్తారు. అదే విదంగా ఆర్యసమాజ్ సిద్దాంతాలకు అనుగుణంగా జంతు బలులు ఈ
ఆలయ పరిసరాల్లో నిషేదం.. తమ ఇళ్ళల్లోనే ఏ బలులైనా చేసుకునే అవకాశం ఉంటుంది...
నెత్తురు చుక్క చిందించం….
ఆర్య సమాజ్ సంప్రదాయంలో బోనాల పండుగ
– మరుపల్ల రవి, బీరన్న ఉర్సు ఆలయ కమిటి చైర్మన్
బహుశా మా ప్రాంతంలో జరిగినట్టు నాకు తెలిసి దేశంలో ఎక్కడా జరుగదు.. పూర్తిగాజంతు బలులు నిషేదం.. ఆలయ ప్రాంగణంలో ఎక్కడా ఒక్క రక్తపు చుక్క కూడారాలదు..ఇళ్ళల్లో మాత్రం జంతుబలులు చేసుకోవచ్చు. ప్రతి ఏటా ఉదయం బీరన్న ఆలయ ప్రాంగణంలో ఆర్యసమాజ్ జెండాను ఆవిష్కరిస్తాము. మరుసటి ఏడాది బోనాల పండుగకు ఒక్కరోజు జెండాను దింపుతాము.. పండుగ రోజు తిరిగి ఆవిష్కరిస్తాము..
పూర్వీకుల నుంచే జాతీయ జెండా సంప్రదాయం
కోరె కృష్ణ,
బీరన్న కరిమాబాద్ ఆలయ కమిటి మాజీ అధ్యక్షుడు
మా పెద్దలనుంచి తరతరాలుగా ఈ సంప్రదాయం వస్తోంది.. బహుశా 1947 నుంచే జాతీయజెండాను ఆవిష్కరిస్తున్నాం.. రజాకార్ల భయం వల్ల బోనాల పండుగ కూడా చేసే పరిస్థితి లేకుండా పోయింది.. జాతీయ జెండాను ఎగర వేయడం అంటే అప్పట్లో ప్రాణాలకు తెగించడన్నమాటే.. అందుకే ప్రాణాలకు తెగించి జాతీయ జెండాను ఎగుర వేసారు.. మేము ఆ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నాం…
—————————-