Nayini Rajender Reddy
Nayini Rajender Reddy| ఆకేరు న్యూస్, హనుమకొండ: మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి, ఐక్యత మార్గంలో ప్రజలు నడవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన పోరాటం, త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
గాంధీ జయంతి సందర్భంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరై గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీజీ సత్యం, అహింస, శాంతి, ఐక్యతకు ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్ర్య ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
బీజేపీపై విమర్శలు
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ గాంధీజీని తక్కువ చేసి చూపించేలా ప్రచారం చేస్తోందని నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. గాంధీ కంటే గాడ్సే గొప్పవాడిగా చూపించే ప్రయత్నాలు సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి వేదికల్లో జరుగుతున్నాయని విమర్శించారు. స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన సేవలు, త్యాగాలను చరిత్ర నుంచి చెరిపివేయడం సాధ్యం కాదన్నారు.
దేశం కోసం జీవితాలను అంకితం చేసిన మహనీయుల త్యాగాలను నేటి తరం గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. గాంధీజీ ఆశయాలైన సత్యం, అహింస, సామాజిక సమానత్వం, దేశ ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
లాల్ బహదూర్ శాస్త్రి సేవలను కూడా నాయిని రాజేందర్ రెడ్డి స్మరించుకున్నారు. నిరాడంబరత, దేశభక్తి, కర్తవ్యనిబద్ధతకు శాస్త్రిజీ ప్రతీకగా నిలిచారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ పులి ప్రియాంక, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
