* టీటీడీ ప్రక్షాళ దిశగా ఈఓ చర్యలు
* సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం.. ఇక సులభతరం
* సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈఓ తనిఖీలు
ఆకేరు న్యూస్, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. నూతన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chief Minister Chandrababu Naidu) ఆదేశాలతో సామాన్య భక్తుల ఇబ్బందులపై దృష్టి సారిస్తోంది. సీనియర్ సిటిజన్లకు పెద్దపీట వేయనుంది. ఈమేరకు టీటీడీ(TTD) ఈవో శ్యామల రావు (EO Syamala Rao) ప్రక్షాళన దిశగా చర్యలు చేపడుతున్నారు. గోకులం గెస్ట్ హౌస్ లోని మీటింగ్ హాలులో టీటీడీ(TTD) లోని అన్ని విభాగాల అధికారులతో తాజాగా ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, ఆకౌంట్స్ ,సర్వీసెస్ , ఏస్టేట్ విభాగాలపై లోతుగా సమీక్షించారు. ఇటీవల 6 నెలల కాలంలో గత పాలకమండలి విడుదల చేసిన దాదాపు రూ.1500 కోట్లకు పైగా నిధులు వినియోగం పై ఈవో లోతుగా అధ్యయనం చేస్తున్నారు.
సీఎం తిరుపతిని సందర్శించిన సందర్భంలో..
ముఖ్యమంత్రి హోదాలో ఇటీవల చంద్రబాబు తిరుపతిని దర్శించిన సందర్భంలో మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లలో తిరుమలను భ్రష్ఠు పట్టించారని, పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. ఈక్రమంలో సీఎం చంద్రబాబు(Chandrababu) విజన్(Vision) ప్రకారం యాక్షన్ ప్లాన్ ను రూపొందించినట్లు ఈవో వెల్లడించారు. సిఫార్సు లేఖలపై దర్శనాలు, సేవలు కేటాయించే అదనపు ఈవో క్యాంపు కార్యాలయ సిబ్బందిని కూడా ఈవో(EO) ప్రశ్నించారు. అన్నప్రసాద భవనంలోనూ తనిఖీలు చేపట్టారు..వడ్డిస్తున్న ఆహారం రుచికరంగా ఉందా, ఎదైనా లోపాలు ఉన్నాయా అని భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాదం తయారీ విధానాన్ని, వినియోగించే ముడిసరుకులు నాణ్యత కూడా ఈవో పరిశీలించారు. భక్తులకు అందించే సదుపాయాలు, సౌకర్యాల విషయంలో రాజీపడితే చర్యలు తప్పవని అధికారులను ఈవో హెచ్చరించారు. సీనియర్ సిటిజన్లకు దర్శనం సులభతరం చేసేలా ప్రణాళికలు రచించాలని ఆదేశించారు.
—————————