- పొంగిపొర్లుతున్న వాగులు
* మత్తడి దుముకుతున్న కమలాపూర్ చెరువు
ఆకేరు న్యూస్, కమలాపూర్ : కమలాపూర్ మండల వ్యాప్తంగా మొంతా తుఫాన్ ప్రభావం వల్ల వందల ఎకరాలలో పంటచేలు నీట మునిగాయి. వరి,పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. వరుస వర్షాలతో పత్తి చేలు ఊటబట్టి దిగుబడి తగ్గింది. ఈ తరుణంలో చేతికి వచ్చిన పంటను తీసే క్రమంలో తుఫాన్ వాతావరణం వల్ల పండిన పంట సైతం చేతికి వచ్చే అవకాశం లేకుండా పోయేలా ఉందని రైతులు అంటున్నారు. దీనికి తోడు వరి పొలాలు కోతకు వచ్చే దశలో ఉన్నందున వర్షం రావడంతో పంట ఎన్నులు కింద పడిపోయి, కాపాడుకోవడం కష్టమని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పంట నష్టపరిహారం చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పొంగిపొర్లుతున్న వాగులు,చెరువులు
వరద ఉధృతి వల్ల కమలాపూర్ పెద్ద చెరువు మత్తడి నిన్నటి అర్థరాత్రి నుంచి ఉదృతంగా ప్రవహిస్తుంది. మత్తడి హుజురాబాద్-పరకాల ప్రధాన రహదారి పైకి దాదాపు అర కిలోమీటర్ మేర విస్తరించి ప్రవహిస్తుంది. మండలంలోని ఉప్పల్ , శంభునిపల్లి, వంగపల్లి గ్రామాల్లో వాగులు బ్రిడ్జి నీ ఆనుకుని ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఉప్పల్ వాగులో వరద నీరు ఎక్కువ కావడంతో ఉప్పల్ గ్రామ శివారులోనీ పంట పొలాలు అన్ని నీట మునిగాయి. వాగు ఉధృతి వల్ల ఉప్పల్ – దేశరాజ్ పల్లె మార్గాల మధ్యన రోడ్డు వరద ప్రభావానికి గురై రాకపోకలు నిలిచిపోయాయి.
