Errabelli Dayakar Rao
* 14 మంది విద్యార్థినులకు ఇబ్బందులు..
* గేటు వద్దే మాజీ మంత్రి ఎర్రబెల్లి ధర్నా
ఆకేరు న్యూస్, పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గురుకుల బాలికల పాఠశాలలో ఎలుకల సంచారంతో 14 మంది విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. విద్యార్థినులను పరామర్శించేందుకు శుక్రవారం పాఠశాలకు వెళ్లిన ఆయనను పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు.
పాఠశాల గేటు వద్ద నిరసన
తనను అడ్డుకోవడంపై ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాఠశాల గేటు వద్ద ధర్నాకు దిగారు. విద్యార్థినుల భద్రత విషయంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం సరికాదన్నారు.
గత ఘటనలను ప్రస్తావించిన ఎర్రబెల్లి
గతంలో ఇదే పాఠశాల వాచ్‌మన్‌ను పాము కరిచిన ఘటనను కూడా ఎర్రబెల్లి ప్రస్తావించారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
ఫోన్లో మాట్లాడిన మాజీ మంత్రి
ఈ సందర్భంగా సోషల్ వెల్ఫేర్ శాఖ రాష్ట్ర సెక్రటరీతో ఫోన్లో మాట్లాడిన ఎర్రబెల్లి.. పాలకుర్తి గురుకుల పాఠశాలలో నెలకొన్న పరిస్థితులను వివరించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. గురుకుల విద్యార్థుల భద్రత, మౌలిక వసతులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ.. విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, యువజన, మహిళా, సోషల్ మీడియా విభాగాల నాయకులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
