PAWAN KHERA ARREST SUPREME COURT
* అస్సాం పోలీస్ ల వేట
ఆకేరున్యూస్, ప్రత్యేకప్రతినిధి :
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రచార విభాగం చైర్మన్ పవన్ ఖేరా కోసం అస్సాం పోలీసులు వేట మొదలు పెట్టారు. అస్సాం పోలీసులు నమోదు చేసిన కేసులో తెలంగాణ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. దీంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఆయన నేరుగా అస్సాంలోని సంబంధిత కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేక పోలేదు. ఆ లోపు ఆయనను అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు..
* పవన్ ఖేరా ను అస్సాం పోలీసులు ఎందుకు వేటాడుతున్నారు. ?
ఏప్రిల్ 4, 2026న పవన్ ఖేరా నిర్వహించిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మకు సంబంధించి ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె వద్ద వివిధ దేశాలకు చెందిన మూడు పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని ఇది చట్టవిరుద్ధమని ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై రినికి భుయాన్ శర్మ ఫిర్యాదు మేరకు అస్సాంలోని గౌహతి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనపై పరువు నష్టం మరియు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
*ఆయన తెలంగాణ హైకోర్టును ఎందుకు ఆశ్రయించారు…?
అస్సాంలో కేసు నమోదైన తర్వాత, ఢిల్లీలోని పవన్ ఖేరా నివాసం పై దాడి చేసి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పవన్ ఖేరా తెలంగాణ హైకోర్టులో ట్రాన్సిట్ ముందస్తు బెయిల్ (Transit Anticipatory Bail) కోసం దరఖాస్తు చేశారు.
తన భార్య హైదరాబాద్‌లో నివసిస్తున్నారని, అందువల్ల తనకు ఇక్కడి కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని ఆయన వాదించారు.
10 ఏప్రిల్ 2026న తెలంగాణ హైకోర్టు ఆయనకు ఒక వారం పాటు అరెస్ట్ నుండి రక్షణ కల్పించింది. ఈ సమయంలోగా అస్సాంలోని సంబంధిత కోర్టును ఆశ్రయించి బెయిల్ పొందాలని ఆదేశించింది.
* సుప్రీంకోర్టు ఏం చెప్పింది ?
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉపశమనాన్ని సవాలు చేస్తూ అస్సాం ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. పవన్ ఖేరా భార్య ఆధార్ కార్డ్‌లో నివాసం ఢిల్లీ అనే ఉందని, ఎవరైనా ఒక వ్యక్తి పది చోట్ల ఇండ్లు కొనుగోలు చేస్తేనో లేదా అద్దెకు తీసుకుంటేనో ఆ పరిధిలోనే తనను విచారణ చేయాలని కోరడం సరియైందని అడ్రస్ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మ తరపు న్యాయవాది తుషార్ మెహతా వాదించారు. 15 ఏప్రిల్ 2026న ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ హైకోర్టు పరిధి దాటి ఈ ఉత్తర్వులు ఇచ్చిందని అభిప్రాయపడుతూ, ఆ వారం రోజుల రక్షణ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అస్సాంలో కేసు నమోదైనప్పుడు, ఢిల్లీలో నివసించే వ్యక్తి తెలంగాణలో బెయిల్ కోరడాన్ని కోర్టు ఆశ్చర్యకరమని పేర్కొంది. ఈ స్టే వల్ల ఆయన అస్సాం కోర్టులో బెయిల్ పొందే హక్కుకు ఎలాంటి భంగం కలగదని, ఆయన అక్కడ చట్టపరమైన పోరాటం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
———————————————–
