* వికాసం కావాలో.. విధ్వంసం కావాలో ప్రజలు తేల్చుకోవాలి
* ప్రశ్నించే గొంతును గెలిపించండి
* మాజీ మంత్రి హరీశ్‌రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పదేళ్ల వికాసం గెలవాలో, రెండేళ్ల విధ్వంసం గెలవాలో ప్రజలు నిర్ణయించుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. సోమాజిగూడ హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్‌ది ప్రెస్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ హైడ్రా పేరిట జరుగుతున్న అరాచకాలను ప్రజలు గుర్తించుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి హయాంలో బ్లాక్ మెయిల్ పాలన జరుగుతోందన్నారు. పారిశ్రామికవేత్తలను ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. అక్రమ నిర్మాణాల పేరుతో భట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. రేవంత్ సెటిల్మెంట్ అన్నారు. రెండేళ్ల రేవంత్ పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయన్నారు. రేవంత్ రెడ్డి పాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారన్నారు. కాంగ్రెస్‌ను ఓడించకపోతే రాష్ట్ర ప్రజలు మరో మూడేళ్లు నరకయాతన అనుభవించాలన్నారు. రేషన్ బంద్ చేస్తాం.. స్కీములను బంద్ చేస్తాం.. అంటూ రేవంత్ చివరకు ప్రజలను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి ఆగిపోతుందని కంటోన్మెంట్ లో కూడా బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఆరోజు కంటోన్మెంట్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతామని, భూముల రెగ్యులరైజేషన్ అన్నారని ఈరోజు ఎక్కడైనా చేశారా అని ప్రశ్నించారు. కంటోన్మెంట్ లో రోడ్లన్నీ గుంతలమయం.. రాత్రి పూట చీకట్లు అన్నారు. కంటోన్మెంట్ లో ఇచ్చిన ఏ హామీ కూడా రేవంత్ నెరవేర్చలేదన్నారు. రెండేళ్ల నుంచి అజారుద్దీన్ ను ఎందుకు మంత్రి చేయడం లేదని, బీఆర్ ఎస్ ఒత్తిడితో ఈరోజు ఆయనను మంత్రిని చేశారన్నారు.
