* భూముల కోసం పోరాటం చేస్తున్నవారితో మాట్లాడ్డం లేదు
* గూండాలు, పోలీసులతో బెదిరిస్తున్నారు
* లగచర్ల ప్రజలపై కర్కశంగా వ్యవహరిస్తున్నావు
* మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ములాఖత్ అనంతరం మాజీ మంత్రి హరీశ్ రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనమీద, సోకాల్డ్ ప్రజాపాలన మీద ప్రజల తిరుగుబాటు ప్రారంభమైందని,
మా భూముల మాక్కావాలని పోరాటం చేస్తున్న ప్రజలతో మాట్లాడాల్సింది పోయి.. గూండాలతో, పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ములాఖత్ అనంతరం చర్లపల్లి జైల్ వద్ద హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఓటు వేసి గెలిపిస్తే బాగు పడతామని ఆశపడ్డ రైతుల నోట్లో మట్టికొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల గ్రామ ప్రజలపై కర్కశంగా వ్యవహరిస్తున్నారని, కట్టుబట్టలతో ఊళ్లు వదిలి పారిపోయేలా చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నిర్వర్తించే ప్రయత్నం నరేందర్ రెడ్డి చేసిండని, రాష్ట్రంలో ఎవరు తిరుగుబాటు చేసినా బీఆర్ఎస్ కుట్ర అంటున్నడని ఆరోపించారు. అశోక్ నగర్ లో విద్యార్థులు తిరగబడితే బీఆర్ఎస్ కుట్ర అంటరు.. రైతులు రోడ్ల మీదకు వస్తే బీఆర్ఎస్ కుట్ర అంటరు.. పోలీసులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తే బీఆర్ఎస్ కుట్ర అంటరు.. గురుకుల విద్యార్థులు నిరసన చేస్తే బీఆర్ఎస్ కుట్ర అంటరు.. చివరకు సొంత నియోజకవర్గంలో భూముల కోసం గిరిజనులు పోరాడితే దీని వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందంటరు.. అని వెల్లడించారు.
ఏ వర్గాలైతే పోరాటం చేస్తున్నయో వారికి అండదండగా ఉండటం ప్రతిపక్షం బాధ్యత అని తెలిపారు. నువ్వు చేసే తప్పులకు, నేరాలకు, అక్రమాలకు చిడుతలు వాయిస్తూ చెక్క భజన చేయాలా.. అని ప్రశ్నించారు. మాకు ఉద్యమాలు.. అరెస్టులు కొత్త కాదన్నారు. నన్నో, కేటీఆర్ నో, మా ఎమ్మెల్యేలను అరెస్టు చేయండి కానీ అమాయక గిరిజన రైతులను అరెస్టులు చేయడం సరికాదన్నారు. ఆరోజు మల్లన్న సాగర్ లో రెండు రోజులు నిరాహార దీక్ష చేస్తే. రేవంత్‌కు రక్షణ ఇచ్చినమని వివరించారు. మా లీడర్ ఆఫ్ అపోజిషన్ మా మధుసూదనాచారి గారు లగచర్లకు వెళ్తే అడ్డుకున్నవు.. ఆర్ఎస్ ప్రవీణ్, కార్తీక్ రెడ్డి లను అడ్డుకున్నవు.. ఎంపీ అరుణ వెళ్లకుండా అడ్డుకున్నవు.. తొమ్మిది నెలల గర్బిణీ మీద చాతి మీద తొక్కుతూ ఇంట్లోకి వెళ్లారని విమర్శించారు. ఇదేనా మీరు చేసే పాలన? ఇదేనా ప్రజాపాలన? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో 14వేల ఎకరాల్లో భూమి తయారు చేసిండు కేసీఆర్ ఫార్మాసిటీ కోసం తయారుచేస్తే, ఉన్న భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తడట. పచ్చటి పొలాల్లో చిచ్చు బెడుతున్నడన్నారు. ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? అన్నారు.
అదానీ, అల్లుల్ల కోసం..
కొడంగల్, జహీరాబాద్ లలో పార్మాసిటీ భూముల సేకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలని రేవంత్‌కు హరీశ్ సూచించారు. నీ ప్రాధాన్యం అదానీ, నీ అల్లుల్లు అని విమర్శించారు. దళిత, గిరిజన, పేదల పక్షాన మేం పోరాటం చేస్తం. బీఆర్ఎస్ పార్టీ చేస్తుంటే, సమాధానం చెప్పలేక కేటీఆర్ మీద కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఎవరిపైనా తాము కేసులు పెట్లేదని, ప్రశ్నించే గొంతు కేటీఆర్ మీద కేసులు పెడతరా అన్నారు. లగచర్ల కేసులో కేటీఆర్‌ని ఇరికించే ప్రయత్నం చేశారన్నారు. చదివే అవకాశం లేకుండా తప్పుడు రిమాండ్ రిపోర్టులో సంతకం పెట్టించారని ఆరోపించారు. నరేందర్ రెడ్డిని జైలులో పెట్టి భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఉన్నది ప్రజల కోసమా, బడాబాబులు, పారిశ్రామికవేత్తలు, అదానీ, సొంత అల్లుళ్ల కోసమా అని ప్రశ్నించారు. నరేందర్ రెడ్డి నిర్దోషిగా బయటకు రావడం ఖాయమన్నారు.
…………………………………………