* నామినేషన్‌ను బలపరచిన నలుగురు సామాన్యులు
* హాజరైన చంద్రబాబు, పవన్‌కల్యాణ్
* ఏపీలో క్లీన్ స్వీప్ చేస్తాం : చంద్రబాబు
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : ఇద్దరు ఓబీసీలు, ఒక దళితుడు, ఒక పండితుడు బలపరచగా.. పుష్యా నక్షత్రం, గంగా సప్తమి కలసి వచ్చిన సుముహూర్తాన ప్రధాని మోదీ వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. పండితులు నిర్ణయించిన సుముహూర్తం ఉదయం 11:40 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కాన్వాయ్ లో వచ్చిన మోదీ.. కారు దిగి నడుచుకుంటూ ఒక్కరే లోపలికి వెళ్లారు. అప్పటికే ఆ కార్యాలయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. నాలుగు కులాలకు చెందిన సామాన్యులు ప్రతిపాదించగా మూడోసారి వారణాసి నుంచి మోదీ నామినేషన్ సమర్పించారు. ప్రముఖ జ్యోతిష్యుడు, అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తాన్ని నిర్ణయించిన పండిట్ గణేశ్వర్ శాస్త్రి ఈ పత్రాలపై తొలి సంతకం చేశారు. తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న వివరాలన్నీ నిజమైనవేనంటూ మోదీ రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రమాణపత్రాన్ని చదివి వినిపించారు. ఆపై ఆ పత్రాలను రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ కు సమర్పించారు.
సోషల్ మీడియాలో భావోద్వేగ వీడియో
నామినేషన్‌కు దాఖలుకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ వీడియోను పోస్టు చేశారు. వారణాసితో తనకున్న అనుబంధాన్ని ఆ వీడియోలో గుర్తు చేశారు. ‘2014లో నేను కాశీకి వచ్చినప్పుడు.. గంగమ్మ నన్ను ఒడిలోకి తీసుకుంది. ఒక తల్లి తన బిడ్డను ఎలా అక్కున చేర్చుకుంటుందో గత పదేళ్ల కాలంలో నన్ను కాశీ అలా స్వీకరించింది. తల్లితో బిడ్డకు ఉండే బంధం నాకు ఈ నగరంతో ఏర్పడింది. ఇది మాటల్లో వర్ణించలేని అనుభూతి’ అంటూ మోదీ చెమర్చిన కళ్లతో చెప్పారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆశీర్వాదం ఉండాలని, అది తనకు ఇకపైనా కొనసాగుతుందన్నారు. మోదీ ఇప్పటికే రెండు సార్లు వారణాసి నుంచి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మూడోసారి అంతకు మించి మెజారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. కాగా, చంద్రబాబు నామినేషన్ కార్యక్రమానికి ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో తాము క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. పెరిగిన పోలింగ్ శాతం తమకు అనుకూలిస్తుందని, ఏపీలో ఏర్పడేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అని జోష్యం చెప్పారు.
—————-