* సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
* మహానగరంలో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ
* కొన్ని ప్రాంతాల్లో నేటి సాయంత్రం వరకూ నిలిచిన సరఫరా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మొత్తం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఏకంగా 13 మంది దుర్మరణం చెందారు. మేడ్చల్ జిల్లాల బాచుపల్లి లో జరిగిన ఒక్క ప్రమాదంలోనే నాలుగేళ్ల బాలుడి సహా ఏడుగురు మరణించారు.
మే నెలలో రికార్డు స్థాయి వర్షపాతం
మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. సాయంత్రం 5.30 గంటలకు మొదలైన వాన నిమిషాల్లోనే తీవ్రరూపం దాల్చింది. సుమారు రెండు గంటల పాటు దంచికొట్టింది. మే నెలలో ఎన్నడూలేని రీతిలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. 13.3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అధిక వర్షపాతంతో నగరం స్తంభించిపోయింది. రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు విషాదాలు చోటుచేసుకున్నాయి.
బాచుపల్లిలో గోడకూలడంతో ఏడుగురు..
బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి నాలుగేళ్ల బాలుడితో సహా ఏడుగురు మరణించారు. మృతులు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. భారీ వర్షాలు, ఈదురు గాలులకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలిన నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో గోడ కూలిన ఘటనలో కార్మికులు మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గాయపడిన మరో నలుగురు కార్మికులకు వెంటనే వైద్యసేవలు అందించాలని కోరారు.
వేర్వేరు ప్రాంతాల్లో మరో ఆరుగురు..
బహదూర్‌పురాలో విద్యుదాఘాతంతో పండ్ల వ్యాపారి మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి మండలంలో పిడుగుపాటుకు ఓ యువ రైతు మృతి చెందాడు. మెదక్ జిల్లా రాయిలాపూర్ గ్రామంలో గోడ కూలిన ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు. మరో ఘటనలో బుధవారం ఉదయం బేగంపేట నాలాలో రెండు గుర్తుతెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. మరోవైపు భారీ వర్షానికి పలు మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కొట్టుకుపోయింది. జోగిపేట, మాసాయిపేట మార్కెట్ యార్డుల్లో వరి వర్షానికి తడిసిపోయింది. వాటర్‌ప్రూఫ్ కవర్లు లేకుండా బహిరంగ ప్రదేశంలో ఉంచిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి సమయం లేకుండా ఆకస్మిక వర్షం కారణంగా రైతులు నాశనమయ్యారు. సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
విద్యుత్ వ్యవస్థ ఆగమాగం..
మంగళవారం రాత్రి కురిసిన జోరువానకు చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. నగరంలోని చాలా ప్రాంతాలు చీకట్లోనే మగ్గాయి. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, వెంగళరావునగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో నిన్న సాయంత్రం ఐదు గంటలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, ఈరోజు ఉదయం 8 వరకు పునరుద్ధరణ కాలేదు. కూకట్‌పల్లిలోని కొన్ని ప్రాంతాల్లో అయితే.. సాయంత్రం 3.30 వరకు కరెంట్ రాలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని పనులు నిలిచాయి. చార్జింగ్ లు లేక కొందరి ఫోన్లు సైతం మూగబోయాయి.
—————————–